
సాక్షి, హైదరాబాద్: భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్తకు ఉమ్మడి హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. కరీంనగర్ జిల్లా కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను సమర్థిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. 11 ఏళ్ల క్రితం హుజూరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ సరితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా అనుమానించడం మొదలుపెట్టాడు. 2010 అక్టోబర్ 13న తాగి వచ్చి రోకలితో సరిత తలపై బాది హత్య చేశాడు.
ఆమె సోదరుని ఫిర్యాదుతో శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ కరీంనగర్ జిల్లా కోర్టు 2012 మేలో తీర్పు చెప్పింది. తన తొమ్మిదేళ్ల కుమార్తె సాక్ష్యం చెల్లదని, శిక్ష రద్దు చేయాలని శ్రీనివాస్ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టేసింది. పిల్లల సాక్ష్యాల్ని యథాతథంగా తీసుకోవచ్చని, కింది కోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఆస్కారం లేదని ధర్మాసనం తాజాగా స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment