హైదరాబాద్ : మహిళా ప్రయాణికురాలిని తీవ్రంగా వేధించిన కేసులో మల్టీనేషనల్ కంపెనీ ఓలా క్యాబ్ డ్రైవర్ ఒకరు అరెస్టయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు క్యాబ్ డ్రైవర్ శివకుమార్(22)ను బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు వనస్థలిపురం పోలీసులు మీడియాకు తెలిపారు. వివరాల్లోకివెళితే..
గచ్చిబౌలి సమీప గౌలిదొడ్డి నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకుగానూ ఓ మహిళ ఓలా షేరింగ్ క్యాబ్‌ను బుక్ చేశారు. గౌలిదొడ్డిలో ఆమె కారు ఎక్కారు. కొద్ది దూరంలోనే మిగతా ప్యాసింజర్లంతా దిగిపోయారు. అదే డ్రైవర్.. ఒంటరి మహిళను వేధించడం మొదలుపెట్టి, మొబైల్‌నంబర్ ఇవ్వాల్సిందిగా బలవంతం చేశాడు. మాటల్లోనే కారును దారి మళ్లించి పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే మీదకు తీసుకెళ్లాడు. అప్పటికే బెంబేలెత్తిన మహిళ.. గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ ఆమెను ఆరాంఘర్ చౌరస్తా వద్ద దింపేసి పారిపోయాడు.
అనంతరం ఆటోలో వనస్థలిపురంలోని ఇంటికి వెళ్లిన బాధితురాలు.. షీ టీమ్స్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదుచేసింది. క్యాబ్ డ్రైవర్ వివరాలు తీసుకున్న షీటీమ్స్.. బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌కు, అటునుంచి కోర్టుకు తరలించారు.