
దుబాయ్: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఓ భారతీయుడ్ని దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నవంబర్ 18, 2018న చోటుచేసుకోగా ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు ఫిబ్రవరి 28న వెలువడనుంది. దుబాయ్‌కి చెందిన ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని థానేకు చెందిన 31ఏళ్ల వ్యక్తి దుబాయ్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు. నవంబర్ 18న 15 సంవత్సరాల బాలిక తల్లితో కలిసి ఆ షాపింగ్ మాల్‌కు వచ్చింది. తల్లి దూరంగా ఉన్న సమయంలో అతడు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ బాలిక, ఆమె తల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
కాగా తన తల్లి షాపింగ్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలో అతడు ఓ డ్రస్‌ను తీసుకుని, తనను పక్కకు లాగి దాన్ని వేసే ప్రయత్నం చేశాడని.. సహాయం చేసే నెపంతో తనను వేధించినట్లు పోలీసుల విచారణలో బాలిక పేర్కొంది. అయితే బాలికకు అరేబియన్ సాంప్రదాయ దుస్తులు వేసుకునే విషయంలో గుండీలు పెట్టడానికి సహాయం చేశానని నిందితుడు పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. ఆఖరి గుండీ పెట్టే సందర్భంలో అప్రయత్నంగా తన చేయి బాలికకు తగిలి ఉండవచ్చని తెలిపాడు. పోలీసుల విచారణలో.. సహచరులు బాలిక తల్లితో బిజీగా ఉన్న కారణంగానే అతడు ఆమెకు సహాయం చేయటానికి వెళ్లినట్లు తేలింది.