సాక్షి, హైదరాబాద్: నగరశివార్లలోని టెట్రాన్ కంపెనీసహా ఖాయిలాపడ్డ పరిశ్రమల భూముల్ని కబ్జా చేయడానికే జయరాం హత్యకు రాకేష్‌రెడ్డి కుట్ర చేసినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ విషయాన్ని ఆఖరి నిమిషం వరకు ఇతర నిందితులకూ తెలియకుండా రాకేష్ గోప్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. వీణ పేరుతో ‘హనీట్రాప్’చేసి జయరాంను జూబ్లీహిల్స్ క్లబ్ వద్దకు రాకేష్ రెడ్డి రప్పించాడు. అక్కడి నుంచి అతడిని జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని ఇంటికి తీసుకొచ్చింది మాత్రం కిషోర్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ అని తెలుస్తోంది. రాకేష్ రెడ్డితో పాటు నిందితులు శ్రీనివాస్, నగేష్, విశాల్‌ల పాత్రపై ఇప్పటికే స్పష్టత వచ్చినప్పటికీ జూనియర్ ఆర్టిస్ట్ సూర్య, రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీను, రామ్‌ల పాత్రపై లోతుగా ఆరా తీస్తున్నారు. జయరాం భార్య పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదు, విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా శిఖా చౌదరిపై చోరీ కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నారు. లోతుగా విచారించడం కోసం రాకేష్, శ్రీనివాస్‌ల కస్టడీ గడువును మరో మూడు రోజులు పొడిగించాల్సిందిగా కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
15 ఎకరాల భూమిపై కన్నేసి!
జయరాం,అతడి భార్య పద్మశ్రీ ప్రవాస భారతీయులుగా ఉండటం, కంపెనీల వ్యవహారాలు చక్కబెట్టడంలో శిఖా చౌదరి విఫలం కావడంతో టెట్రాన్‌తో పాటు మరో కంపెనీ సైతం లాకౌట్‌లోకి వెళ్లాయి. కంపెనీలు పని చేయకపోయినా అవి విస్తరించి ఉన్న దాదాపు 15 ఎకరాల స్థలాలు అత్యంత ఖరీదైనవిగా మారిపోయాయి. వీరి నేపథ్యం మొత్తం తెలిసిన రాకేష్ రెడ్డి ఆ భూముల్ని కబ్జా చేయాలని భావించాడు. దానికి మార్గాలు అన్వేషిస్తున్న నేపథ్యంలోనే ఇతడికి జయరాం అమెరికా నుంచి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయనతో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకుని చంపేస్తేనే తన పథకం పారుతుందని భావించిన రాకేష్.. జనవరి చివరి వారంలోనే హత్యకు కుట్రపన్నాడు. అయితే ఈ విషయాన్ని ఆఖరి నిమిషం వరకు ఎవరికీ చెప్పలేదు. జయరామ్ వ్యవహారశైలి తెలిసిన రాకేష్‌రెడ్డి కొత్త సిమ్‌కార్డు తీసుకుని వీణ పేరుతో జయరాంను ‘జై’అని పిలుస్తూ చాటింగ్ చేయడం మొదలెట్టాడు. వీరి మధ్య మొత్తం 170 చాటింగ్స్ ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఆ ఒక మాట చెప్పి బుక్కయ్యారు
జయరాంను నిర్భంధించాలని కుట్రపన్నిన రాకేష్.. వీణా పేరుతో జనవరి 30న లంచ్‌కు పిలిచాడు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌కు వస్తే అక్కడ నుంచి కలిసి వెళ్దామంటూ వాట్సాప్ సందేశం పెట్టాడు. అతడు రావడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో రౌడీషీటర్ నగేష్‌ను రమ్మని పిలిచాడు. ఓ వ్యక్తిని నిర్భంధించి డబ్బు వసూలు చేద్దామని అతడితో చెప్పాడు. నగేష్ తన సమీప బంధువు విశాల్‌కు ఫోన్‌చేసి నీ లైఫ్ సెటిల్ చేస్తానంటూ తనతో కలుపుకున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్ సూర్యకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా రాకేష్‌తో పరిచయం ఉంది. గత నెల 30న రాకేష్‌ను కలిసేందుకు వచ్చిన సూర్య.. తనతోపాటు స్నేహితుడైన అసిస్టెంట్ డైరెక్టర్ కిషోర్‌ను తీసుకువచ్చాడు. దీంతో నగేష్, విశాల్‌లను ఇంట్లోనే ఉంచిన రాకేష్.. వీరిద్దరినీ తీసుకుని బయలుదేరాడు. జూబ్లీహిల్స్ క్లబ్ వరకు వచ్చిన తర్వాత జయరాం కారు నెంబర్ కిషోర్‌కు చెప్పి అతడిని అక్కడ దింపేశాడు. అందులో జై అనే వ్యక్తి వస్తారని, అతడిని వీణ మేడం డ్రైవర్‌ని అంటూ పరిచయం చేసుకుని, అతడి కారులోనే తన ఇంటికి తీసుకురమ్మని రాకేష్ చెప్పడంతో కిషోర్ అలానే చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత సూర్య, కిషోర్‌లు కింది నుంచే వెళ్లిపోగా.. రాకేష్ సహా మిగిలిన ఇద్దరూ జయరాంను ఇంటి పై భాగంలో ఉన్న గదిలోకి తీసుకువెళ్లి నిర్భంధించారు. హత్య చేస్తారనే విషయం సూర్య, కిషోర్‌లకు తెలియకపోయినా వీణ డ్రైవర్ అంటూ ఒకరు అబద్దం చెప్పగా.. మరొకరు సహకరించారు. దీంతో వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి చర్యలకు సంబంధించి న్యాయసలహా తీసుకుంటున్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు
శవాన్ని చూసినా చెప్పక పోవడంతో
తొలుత కొన్ని ఖాళీ రూ.100 స్టాంప్ పేపర్లపై బలవంతంగా జయరామ్‌తో సంతకాలు చేయించుకున్న రాకేష్‌రెడ్డి.. ఆపై బలవంతపు వసూలుకు ప్రయత్నించాడు. జయరాంతో అనేక మందికి ఫోన్లు చేయించి రూ.10లక్షల నుంచి కోటి వరకు వీలున్నంత పంపాల్సిందిగా చెప్పించాడు. చివరకు ఒకరు రూ.6 లక్షలు పంపడంతో తన అనుచరుడిని దస్‌పల్లా హోటల్‌కు పంపి ఆ మొత్తం రిసీవ్ చేసుకున్నాడు. మరుసటి రోజు జయరాంను చంపేద్దామని రాకేష్ అనడంతో.. నగేష్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. తర్వాత విశాల్, రాకేష్‌లు దిండుతో ముఖంపై నొక్కి జయరాంను హత్య చేశారు. మృతదేహం ఇంట్లో ఉండగానే రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీను, రామ్‌లు రాకేష్‌రెడ్డి వద్దకు వచ్చారు. తనకు ఇవ్వాల్సిన రూ.10లక్షలు అడగటం కోసం అంజిరెడ్డి మిగిలిన ఇద్దరినీ వెంట పెట్టుకుని వచ్చాడు. మృతదేహాన్ని చూసిన ఈ ముగ్గురూ భయపడి పారిపోయారు. ఈ విషయంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, సమాచారం ఇవ్వకపోవడం తెలిసిన నేరాన్ని దాచి పెట్టడం కిందికి వస్తుంది. ఇది కూడా నేరమే కావడంతో వీరి విషయంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై దర్యాప్తు అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఓ స్థలానికి సంబంధించి రాకేష్‌కు అంజిరెడ్డి రూ.10లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ల్యాండ్ డీల్ సెటిల్ కాకపోవడంతో తన డబ్బు ఇవ్వాల్సిందిగా అతడు రాకేష్‌పై ఒత్తిడి చేస్తూ అతడి ఇంటికి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇన్‌స్పెక్టర్‌ను బయటే కలిశాడు
తన వాచ్‌మెన్/డ్రైవర్ శ్రీనివాస్‌తో క్రైమ్ సీన్‌ను శుభ్రం చేయించిన రాకేష్.. శవాన్ని జయరాం కారులోనే పెట్టుకుని బయలుదేరాడు. నల్లకుంట పోలీసుస్టేషన్ వరకు వెళ్లిన ఇతడు ఫోన్ ద్వారా ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులును సంప్రదించాడు. చింతల్ లో వీరిద్దని నివాసాలు సమీపంలోనే కావడంలో ఒకరితో మరొకరికి పరిచయముంది. ఆ సమయంతో ఇన్‌స్పెక్టర్ వేరే ప్రాంతంలో ఉన్నానని చెప్పడంతో అక్కడకు వెళ్లిన రాకేష్ కారును దూరంగా ఆపి దగ్గరకు వెళ్లాడు. ఆపై హత్య విషయం ఆయనకు చెప్పగా.. తప్పతాగి జరిగిన ప్రమాదంగా చిత్రీకరిం చాలని సీఐ సూచించారు. హైదరాబాద్ చుట్టు పక్కల అలా చేస్తే సీసీ కెమెరాలు ఇతర ఆధారాలతో పోలీసులు పట్టుకుంటారని.. ఏపీకి వెళ్లి సీన్ క్రియేట్ చేయాలని చెప్పాడు. దీంతో రాకేష్ విజయవాడ వైపు బయలుదేరాడు. దారి మధ్యలో ఉండగా రాకేష్‌కు ఏసీపీ మల్లారెడ్డి ఫోన్ చేశాడు (ఆదిభట్లలో ఉన్న ఓ ల్యాండ్ వివాదంలో వీరికి పరిచయం ఏర్పడింది). దీంతో హత్యతోపాటు.. సీన్ క్రియేట్ చేసేందుకు ఓ స్నేహితుడు సాయం చేశారంటూ మల్లారెడ్డికి రాకేష్ వివరించారు. ఆపై నందిగామలో బీరు కొని.. ఐతవరంలో రోడ్డు కిందకు కారును తోసి రాకేష్ వెనక్కు వచ్చేశాడు.
ఆ డబ్బుపై పొంతనలేని కథనాలు
జయరాం హత్య కేసులో నందిగామ పోలీ సుల విచారణలో రాకేష్ రూ.4.17 కోట్ల ఆర్థిక లావాదేవీలను తెరపైకి తెచ్చాడు. ఇందులో రూ.80 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా పంపానన్నాడు. అక్కడి పోలీసులు అది వాస్తవమేనని ధ్రువీకరిం చారు. హత్యలోనూ రాకేష్, శ్రీనివాస్‌ల పాత్ర మాత్రమే ఉందని తేల్చేశారు. కేసు హైదరాబాద్‌కు బదిలీ అయ్యాక బంజారాహిల్స్ ఏసీపీ నేతృత్వంలో జరిగిన విచారణలో ఇతరుల పాత్ర ఉన్నట్లు తేలింది. జయరాంకు ఇచ్చిన డబ్బుపై రాకేష్ స్పష్టత ఇవ్వలేదు. తొలుత ఈ మొత్తాన్ని అంజిరెడ్డి సమక్షంలో ఇచ్చానని చెప్పాడు. అంజిరెడ్డి సమక్షంలో రాకేష్‌ను విచారించగా ఇది అబద్ధమని తేలింది. ఆ తర్వాత అమెరికాలో ఉన్న ఓ వ్యక్తి ఖాతా నుంచి జయరాం అమెరికా ఖాతాకు బదిలీ చేయించానని అన్నాడు. ఈ హత్యలో శిఖాచౌదరి పాత్రలేదని నిర్ధారించారు. జయరాం మరణవార్త విన్న వెంటనే ఆయన ఇంటికి వెళ్లి తన ప్రాజెక్టు కాగితాలు తీసుకున్నా నని ఆమె అంగీకరిస్తున్నారు. దీనిపై జయరాం భార్య పద్మశ్రీ ఓ ఫిర్యాదూ ఇచ్చారు. ఈ పరి ణామాల నేపథ్యంలో శిఖాచౌదరిపై చోరీ కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment