బనశంకరి: పెర్‌ఫ్యూమ్స్ అమ్మే నెపంతో ఒక మహిళ, ముగ్గురు పురుషుల దోపిడీ ముఠా నగల దుకాణం ఉద్యోగి ఇంటోక్లి చొరబడి భారీమొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లింది. ఈ ఘటన బెంగళూరు కాటన్‌పేటే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.... బంగారు ఆభరణాలు తయారుచేసే కైసర్స్ జ్యువెలర్స్ దేశంలోని పలు నగరాల్లో నగల దుకాణాలను నిర్వహిస్తోంది. నగరంలోని కైసర్ దుకాణంలో గత కొన్నేళ్లుగా సంతోష్‌కుమార్ అనే వ్యక్తి సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. ఇతను కబ్బన్‌పేటే సంజీవప్ప రోడ్డులో అద్దె ఇంటిలో నివాసముంటున్నారు. జ్యువెలరీ దుకాణంలో నగదు కలెక్షన్, బంగారు ఆభరణాలు డెలివరీ చేసేవాడు. జనవరి 22 తేదీన చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి బంగారు నగలను నగరంలో అందజేయడానికి తీసుకొచ్చాడు.
వద్దని చెబుతున్నా...
జనవరి 24 తేదీ ఉదయం 8.30 గంటలకు ఓ మహిళ సంతోష్‌కుమార్ ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది. సంతోష్‌కుమార్ తలుపు తీయగానే మహిళ సుగంధ ద్రవ్యాలు తీసుకువచ్చానని, తక్కువ ధరకు ఇస్తానని తెలిపింది. నిద్రమత్తులో ఉన్న సంతోష్ ఏమీ వద్దు వెళ్లమ్మా అంటూ తలుపు మూసేలోగా పక్కనే దాక్కున్న ముగ్గురు దోపిడీదారులు ఒక్కసారిగా ఇంట్లోరి చొరబడ్డారు. చాకు చూపించి అరిస్తే చంపుతామని బెదిరించి టేప్‌తో నోరు, చేతులు కాళ్లు కట్టివేసి బంధించారు. ఇల్లంతా గాలించి 2 కిలోల 100 గ్రాముల బంగారు నగలున్న బ్యాగ్, రూ.4.95 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు లాక్కుని బయటి నుంచి ఇంటి డోర్ లాక్ చేసుకుని ఉడాయించారు. అతికష్టం మీద సంతోష్‌కుమార్ చేతులు, కాళ్లు విడిపించుకుని గట్టిగా కేకలు వేస్తూ ఇంటి లాక్ తీశాడు. దుకాణం యజమానికి ఫోన్ చేసి దోపిడీ విషయం చెప్పాడు. బాధితులు కాటన్‌పేటే పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. పోలీసులు అతని ఇంటిని, అక్కడి సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. దోపిడీదారుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment