
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరిన బాధితురాలు
సాక్షి, హైదరాబాద్ : అటు విశాఖలో యాచకురాలిపై యువకుడి కీచకపర్వం ఘటన దర్యాప్తు కొనసాగుతుండగానే, హైదరాబాద్‌లో మరో కిరాతకం చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఎస్‌ఆర్ నగర్ రైతు బజార్ వద్ద ఓ వివాహితపై ప్రేమోన్మాది కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. రక్తపుమడుగులో పడిపోయిన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
గతంలో రెండు సార్లు ఫిర్యాదు చేసినా.. : ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే వివాహితను అదే ప్రాంతానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. దీనిపై ఆమె రెండు సార్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. సోమవారం మధ్యాహ్నం రైతు బజార్ వద్ద ఆమెపై కొబ్బరిబోండాల కత్తితో దాడిచేసి మెడ నరికే ప్రయత్నం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయే క్రమంలో స్థానికులకు చిక్కాడు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని విచారిస్తున్నామని, బాధితురాలికి గాంధీ ఆస్పత్రిలో వైద్యం అందుతున్నదని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment