
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో ఓ యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నరాలు, నాడీ వ్యవస్థపై పట్టున్న వైద్యుడు శివతేజరెడ్డి ఆదివారం డాక్టర్స్ క్లబ్‌లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోగులకు వైద్య పరంగా చికిత్స అందిస్తూనే.. సామాజిక స్పృహతో వారికి కావాల్సిన సహాయసహకారాలను శివతేజరెడ్డి అందించేవాడు. తన సొంత డబ్బులు ఖర్చు చేసి వారికి అనేక సదుపాయాలను సైతం కల్పించాడు. అలాంటి వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడటంపై తోటి వైద్యులతో పాటు చికిత్స పొందుతున్న రోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే శివతేజరెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం వెల్లడి కాలేదు.
నెఫ్రాలజీ నుంచి న్యూరాలజీకి..
పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన ఎఫ్‌సీఐ రిటైర్డ్ ఉద్యోగి పులగం అప్పిరెడ్డి, కవిత దంపతుల కుమారుడు శివతేజరెడ్డి(31) ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, కింగ్‌జార్జ్ ఆస్పత్రిలో ఎండీ పూర్తి చేశాడు. విజయనగరంలోని మహారాజా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(మిమ్స్)లో శివతేజరెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తూనే సూపర్ స్పెషాలిటీ కోర్సు చదివాడు. తిరుపతిలో నెఫ్రాలజీ విభాగంలో సీటు సంపాదించాడు. నెఫ్రాలజీ విభాగంలో 8 నెలలు పనిచేసిన తర్వాత సంతృప్తి చెందక.. మళ్లీ పరీక్ష రాసి నిమ్స్ న్యూరాలజీ విభాగంలో సీటు పొందాడు.
రోగుల పరిస్థితి చూసి చలించిపోయి..
శివతేజరెడ్డి గత ఏడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్ వచ్చాడు. అప్పటి నుంచి వారం క్రితం వరకు బయటే ఉంటూ నిమ్స్‌లో విధులకు హాజరయ్యేవాడు. ఆస్పత్రిలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి చలించిపోన అతడు.. తన వేతనం నుంచి రూ.40 వేలు చెల్లించి జిరాక్స్ మిషన్, జనరల్ వార్డులో ఉన్న రోగులకు గీజర్, ఆపరేషన్ థియేటర్‌లో విధులు నిర్వహించే వైద్యులకు అవసరమైన స్లిప్పర్స్‌ను స్పాన్సర్ చేశాడు. రోగులకు వైద్య సేవలందిస్తూనే వారికి పలు రకాల సహాయసహకారాలు అందించేవాడు. తక్కువ కాలంలోనే సామాజిక స్పృహ ఉన్న వైద్యుడిగా గుర్తింపు పొందాడు. న్యూరాలజీ విభాగంలోని 24 మంది యువ వైద్యులకు చికిత్సలపరంగా ఎలాంటి అనుమానం వచ్చినా అతనే పరిష్కరించేవాడు. విధులు ముగిసిన తర్వాత సామాజిక మాధ్యమాలకు దూరంగా ఎక్కువ సమయం లైబ్రరీలోనే గడిపేవాడు. అయితే వారం రోజుల నుంచి శివతేజరెడ్డి ముభావంగా కనిపించినట్టు తోటి వైద్యులు చెపుతున్నారు.
ఎప్పటిలాగే విధులు ముగించుకుని..
ఎప్పటిలాగే శనివారం విధులు ముగించుకుని డాక్టర్స్ క్లబ్‌లోని రూమ్ నంబర్ 307కు శివతేజరెడ్డి వెళ్లాడు. ఆదివారం ఉదయం 7 గంటలకు అతను విధులకు హాజరు కావాల్సి ఉంది. ఎనిమిది గంటలైనా శివతేజ రాకపోవడం.. ఫోన్ చేస్తే ఎత్తకపోవడంతో తోటి వైద్యుడికి అనుమానం వచ్చి రూమ్‌కు వచ్చాడు. లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో ఎంతసేపు పిలిచినా తలుపు తీయలేదు. దీంతో కిటికీ అద్దాలు తొలగించి చూడగా దుప్పటితో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో అతను ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇన్‌స్పెక్టర్ రవీందర్, ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్ మృతుడు వాడిన గదిని, ఫోన్‌ను పరిశీలించారు. ఆదివారం ఉదయం 5.20 వరకు శివతేజరెడ్డి వాట్సాప్ చూసినట్లు ఉందని, 5.30 గంటల తర్వాతే అతను చనిపోయి ఉంటాడని ప్రాథమికంగా నిర్థారించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శివతేజరెడ్డి మృతదేహాన్ని నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు.
అమెరికా వెళ్లిన తల్లిదండ్రులు
శివతేజరెడ్డి సోదరి అమెరికాలో ఉంటోంది. ఆమెకు నెలలు నిండటంతో తల్లిదండ్రులు గత జనవరిలో అమెరికా వెళ్లారు. వారు అమెరికా వెళ్లే ముందు శివతేజరెడ్డిని కలసి వెళ్లినట్లు వనస్థలిపురంలో ఉంటున్న అతని పిన్ని డాక్టర్ సరస్వతి మీడియాకు చెప్పారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన కొత్తలో తమ ఇంటికి తరచు వచ్చే వాడని, ప్రేమ వ్యవహారాలు, ఇతర వ్యాపకాలు లేవన్నారు. ఎవరినైనా ప్రేమిస్తే చెప్పాల్సిందిగా కోరామని.. అయితే అలాంటిదేమీ లేదని, ఆస్పత్రిలో పని ఒత్తిడి అధికంగా ఉందని, పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని చెప్పాడని వివరించారు. శివతేజరెడ్డి తల్లిదండ్రులు అమెరికా నుంచి రావాల్సి ఉంది. శివతేజరెడ్డి మృతి వైద్య రంగానికి తీరని లోటని నిమ్స్ డైరెక్టర్ మనోహర్, మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కసిరెడ్డి కృష్ణారెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్ వెంకటపతి రాజు, డాక్టర్ సింధు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment