
ప్రతికాత్మక చిత్రం
25వ పుట్టిన రోజు కావడంతో ప్రియురాలు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తుందని శివకుమార్ ఆశగా ఎదురు చూశాడు. కానీ..
బెంగళూరు : మాజీ ప్రియురాలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన శివకుమార్ (25) యలహంకలో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటిపక్కనే ఉన్న ఓ యువతితో శివకుమార్‌కు పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి యువతి కుటుంబీకులు ఒప్పుకున్నారు. శివకుమార్ కూడా ఇంట్లో ఈ విషయాన్ని చెప్పి ఒప్పిద్దామనుకునే సమయంలో తల్లి ఆరోగ్యం క్షీణించింది. దీంతో శివకుమార్ సొంత గ్రామానికి తిరిగి వచ్చారు.
అయితే శివకుమార్ తిరిగి సొంత గ్రామానికి వెళ్లడం యువతికి ఇష్టం లేదు. దీంతో ఇద్దరు విడిపోయారు. అయినప్పటీకి శివకుమార్‌కు ఆ యువతిపై ఉన్న ప్రేమ తగ్గలేదు. ఎప్పటికైనా తను మాట్లాడుతుందని వేచి చూశాడు. ఫిబ్రవరి 26న తన 25వ పుట్టిన రోజు కావడంతో ప్రియురాలు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తుందని శివకుమార్ ఆశగా ఎదురు చూశాడు. కానీ సదరు యువతి ఫోన్ చేయలేదు. దీంతో మనస్తాపం చెందిన శివకుమార్.. అదే రోజు రాత్రి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసికొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం తెసుకున్న బెంగళూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.