టటుల్‌ బాజీ గ్యాంగ్‌ ఆటకట్టు | Kidnap Gang Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

టటుల్‌ బాజీ గ్యాంగ్‌ ఆటకట్టు

Published Wed, Nov 28 2018 9:22 AM | Last Updated on Wed, Dec 19 2018 11:08 AM

Kidnap Gang Arrest in Hyderabad - Sakshi

పోలీసుల అదుపులో నిందితులు

సాక్షి, సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా దృష్టి మళ్లించడం, నకిలీ బంగారం అంటగట్టడంతో పాటు ఎరవేసి కిడ్నాప్‌లు, బెదిరింపు వసూళ్లకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన టటుల్‌ బాజీ గ్యాంగ్‌ను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. అత్యంత కీలకమైన ఆపరేషన్‌ చేపట్టి ఇద్దరిని పట్టుకున్నట్లు డీసీపీ అవినాష్‌ మహంతి మంగళవారం వెల్లడించారు. వీరి నుంచి 500 గ్రాముల నకిలీ బంగారం, శాంపిల్‌గా చూపించే చిన్న బంగారం ముక్క స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

మేవాట్‌ రీజియన్‌లో 25 గ్యాంగులు...
రాజస్థాన్‌లోని అల్వార్, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, హర్యానాలోని నుహ్‌ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని మేవాట్‌ రీజియన్‌గా పరిగణిస్తారు. ఇందులోని 35 గ్రామాల్లో 100 మందికి పైగా నేరచరితులే. వీరి నేతృత్వంలో 25 ముఠాలు పని చేస్తున్నారు. నకిలీ బంగారం ఇటుకలను చూపించి అసలువిగా నమ్మించి మోసం చేయడం వీరి ప్రధాన నైజం. ఈ ఇటుకలను ‘టటుల్‌’ గా పిలుస్తారు. మోసాలకు పాల్పడే దందాను ‘బాజీ’ అంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ముఠాకు టటుల్‌ బాజీ గ్యాంగ్‌ అనే పేరు వచ్చింది. 2010 నుంచి నేరాలు చేస్తున్న ఈ అంతర్రాష్ట్ర ముఠా తొలినాళ్లల్లో నకిలీ బంగారం దందా చేసేది. తాజాగా వ్యాపారులకు ఎరవేసి, తమ ప్రాంతాలకు రప్పించడం ద్వారా కిడ్నాప్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేయడం మొదలెట్టింది. 

నోట్లో ముక్కను చూపించి మోసాలు...
ఈ ముఠా తొలినాళ్లల్లో చేసిన ‘బంగారం ఫ్రాడ్‌’లోనే తమదైన పంథా అనుసరించింది. తమ వద్ద మధ్య ఆసియా ప్రాంతం నుంచి తీసుకువచ్చిన, తవ్వకాల్లో దొరికిన బంగారం ఇటుక ఉందని వ్యాపారులకు ఎర వేస్తారు. తక్కువ ధరకు విక్రయిస్తామంటూ తమ ప్రాంతాలకు రప్పిస్తుంది. అప్పటికే ఈ ముఠా సభ్యుడు చిన్న బంగారం ముక్కను తన నోట్లో సిద్ధంగా ఉంచుకుంటాడు. వ్యాపారి వచ్చిన తర్వాత తన చేతిలో ఉన్న చిన్న బంగారపు ఇటుకలా ఉన్న దాంట్లోంచి ఓ ముక్కను తీస్తాడు. వ్యాపారి దృష్టి మళ్లించడం ద్వారా దీనికి బదులు నోట్లు ఉన్న అసలు బంగారం ముక్కను అతడికి ఇస్తాడు. సదరు ముక్కను పరీక్షించే వ్యాపారి అది మేలిమి బంగారంగా తేలడంతో నగదు ఇచ్చి ఇటుక తీసుకుంటాడు. తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే తాను మోసపోయాననే విషయం గుర్తిస్తాడు. కొందరిని అక్కడే బంధించి..

ఫొటోలు కుటుంబీకులకు పంపి...
ఇలా బందీ అయిన బాధితుడిని ఓ ప్రాంతంలో బంధించడంతో పాటు తుపాకీ గురి పెట్టిన ఫొటోలు తీస్తారు. వీటిని బాధితుడి సెల్‌ఫోన్‌ నుంచే అతడి కుటుంబీకులకు వాట్సాప్‌ ద్వారా పంపుతారు. తక్షణం తాము కోరిన మొత్తం బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేయకపోతే తమ వద్ద ఉన్న మీ వాడిని చంపేస్తామంటూ బెదిరిస్తారు. బాధితుడి తరఫు వారు డిపాజిట్‌ చేసిన వెంటనే డ్రా చేసుకుని బందీని విడిచిపెడతారు. నగరానికి చెందిన ఓ ప్రముఖుడికి ఇటీవల ఫోన్‌ చేసింది. దీనిపై అలీ మహ్మద్‌ సర్ఫరాజ్‌ ఫిర్యాదు చేయడంతో సీసీఎస్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ జి.గిరీష్‌రావు నేతృత్వంలో ఎస్సై బి.శ్రవణ్‌కుమార్‌తో కూడిన బృందం రాజస్థాన్‌కు వెళ్లి అతికష్టమ్మీద ఆ ముఠాకు చెందిన కుర్షీద్‌ అహ్మద్, సలీంలను అరెస్టు చేసి తీసుకువచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement