కోల్‌కతా : టీవీ చూడ్డానికి ఇంటికి వచ్చిన మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టాడో వ్యక్తి. బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్ ఈస్ట్ మిద్నాపూర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈస్ట్ మిద్నాపూర్‌లోని హల్దియా టౌన్ షిప్ మురికివాడలో సుజన్ పాత్రో అనే వ్యక్తి భార్య, కూతురితో నివాసముంటున్నాడు. నెల రోజుల క్రితం సుజన్ కూతురికి పెళ్లైంది. శుక్రవారం అతడి భార్య కూతురిని చూడటానికి ఊరు వెళ్లింది. దీంతో సుజన్ ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. ఇంటి పక్కనే ఉండే ఓ మైనర్ బాలిక శాంతి.. ప్రతిరోజూ సాయంత్రం సుజన్ ఇంటికి టీవీ చూడ్డానికి వచ్చేది. రోజూలాగే ఆ రోజు కూడా టీవీ చూడ్డానికి సుజన్ ఇంట్లోకి వెళ్లింది.
కొద్దిసేపటి తర్వాత సుజన్ శాంతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం శాంతిని ఇంట్లో తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి ఇంటికి తిరిగి రాగానే బాలికను చంపి సంచిలో కుక్కిపడేశాడు. అయితే సంచిని బయట పాడేయటానికి అవకాశం లేకపోవటంతో దాన్ని ఇంట్లోనే భద్రపరిచాడు. బాలిక కనిపించకపోవటంతో సుజన్‌పై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు బలవంతంగా అతడి ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడి ఓ సంచిలో శాంతి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపటి తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. శాంతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment