
పోలీసుల అదుపులో బంగారుశెట్టి
నెల్లూరు,అనుమసముద్రంపేట: రొట్టెల పండగ సందర్భంగా ఏఎస్‌పేటకు వచ్చిన ఇద్దరు మహిళలపై లాడ్జీ యజమాని దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్న వైనమిది. ప్రముఖ పర్యాటక క్షేత్రమైన ఏఎస్‌పేట దర్గా సందర్శనార్థం తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు శుక్రవారం ఏఎస్‌పేటలోని ఓ లాడ్డీలో అద్దెకు దిగారు. సాధారణ సమయంలో రూ.200 నుంచి రూ.300 మాత్రమే అద్దెకు గదులు ఇచ్చే క్రమంలో రొట్టెల పండగ సందర్భంగా ఏఎస్‌పేట దర్గాకు భక్తులు పోటెత్తడంతో లాడ్జీ యజమాని సుబ్బరాయుడు అలియాస్ బంగారుశెట్టి అద్దెను పెంచి ఈ మహిళలకు రూ.900 రూమును అద్దెకు ఇచ్చారు.
మరుసటి రోజు శనివారం మూడు గంటలకు ఖాళీ చేయాలని నిబంధన విధించాడు. శనివారం కొంత మంది భక్తులు అద్దె రూముల కోసం తిరుగుతుండగా ఈ మహిళలకు ఇచ్చిన సమయం కంటే ముందుగా ఖాళీ చేయాలని ఆదేశించాడు. మాకు మూడు గంటల వరకు టైమ్ ఉందంటూ మహిళలు సమాధానం చెప్పారు. దీనికి ఆవేశపడిన లాడ్జీ యజమాని రూంలోని మహిళల లగేజీని తానే తెచ్చి రిసెప్షన్ సెంటర్‌లో పెట్టి వెంటనే ఖాళీ చేయాలని వారితో గొడవకు దిగాడు. మహిళలకు దీనికి ఒప్పుకోకపోవడంతో వారిపై చేయి చేసుకున్నాడు. వారి లగేజీని బయటకు విసిరి పారేసి గందరగోళం సృష్టించాడు. మహిళలు ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు లాడ్జీ యజమాని బంగారుశెట్టిని విచారణ నిర్వహిస్తున్నారు.