పాల్వంచ(ఖమ్మం): వారిద్దరూ మైనర్లు. ఆ వయసులో సహజంగా కలిగే పరస్పర ఆకర్షణను ప్రేమగా భ్రమించారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్న విషయం ఆమె ఇంటిలో తెలిసింది. వారిద్దరూ భయపడ్డారు. ఆత్మహత్యకు యత్నించారు. అతడు మృతిచెందాడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. పాల్వంచలో ఆదివారం ఇది జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు... పట్టణంలోని ఇంటర్‌మీడియట్ కాలనీకి చెందిన డిప్లొమా విద్యార్థి మణికంఠ(17). కాంట్రాక్టర్స్ కాలనీలో ఉంటున్న ఆమె పదో తరగతి విద్యార్థిని. వీరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. పరస్పరం ఆకర్షితులయ్యారు. దీనినే ప్రేమగా భ్రమించారు. ఈ విషయం ఇటీవల ఆమె ఇంట్లో తెలిసింది. తండ్రి మందలించాడు. ఆమె ఈ విషయాన్ని తన స్నేహితుడైన అతడితో చెప్పింది.
ఇద్దరూ భయపడ్డారు. క్షణికమైన ఆవేశంతో, ఆలోచనారాహిత్యంతో ఆదివారం సాయంత్రం కాంట్రాక్టర్స్ కాలనీలో నిర్మాణంలోగల మూడంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించారు. కింద పడిపోగానే భయంతో పెద్దగా అరిచారు. పెద్ద శబ్దం, అరుపులు వినిపించడంతో చుట్టుపక్కల వారు పరుగు పరుగున వచ్చారు. రక్తపు మడుగులో అపస్మారక స్థితికి చేరిన వారిద్దరినీ 108 సిబ్బంది స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అతడి తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె రెండు కాళ్లు విరిగాయి. మొహంపై బలమైన దెబ్బలు తగిలాయి. వారిద్దరి పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతడు మృతిచెందాడు. ఘటన స్థలాన్ని సీఐ ప్రవీణ్ కుమార్, పట్టణ ఎస్‌ఐ ముత్యం రమేష్ పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment