అన్న మృతదేహం వద్ద రోదిస్తున్న జహంగీర్‌బీ
ధారూరు: లూనా(ద్విచక్ర వాహనం)పై వెళుతు న్న ఓ వ్యక్తిని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో వ్యక్తి దుర్మరణం చెందాడు. కారుతో సహా పారిపోతున్న డ్రైవర్‌ను అక్కడే ఉన్న యువకులు వెంబడించి పట్టు కుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ధారూరు మండలంలోని రాంపూర్‌తండా బస్‌స్టేజీ వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... పెద్దేముల్ మండలం రేగొండి గ్రామానికి చెందిన మొయినుద్దీన్(55) వికారాబాద్ పట్టణ సమీప శేఖర్‌రెడ్డి క్రషర్ మిషన్ వద్ద నైట్ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
రోజూ సాయంత్రం ఇంటి నుంచి క్రషర్ మిషన్ వద్దకు వెళ్లి తిరిగి ఉదయం పూట ఇంటికి చేరుకుంటాడు. ఆదివారం రాత్రి విధులు నిర్వహించి ఉదయం తన లూనాపై ఇంటికి వస్తున్నాడు. ధారూరు మండలం రాంపూర్‌తండా బస్‌స్టేజీ వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి వస్తున్న కారు లూనాను బలంగా ఢీకొట్టింది. లూనాపై నుంచి మోయినుద్దీన్ కారుపై ఎగిరిపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. లూనాను కారు కొద్దిదూరం అలాగే లాక్కెళ్లింది. ఇది గమనిస్తున్న ఇద్దరు యువకులు కారును పట్టుకునే ప్రయత్నం చేయగా వారి నుంచి తప్పించుకునేందుకు వేగంగా తాండూర్ వైపు పరుగు తీసింది.
ఓ యువకుడు వెంటనే తన సెల్ ద్వారా ముందు స్టేజీ వద్ద మిత్రునికి సమాచారం ఇవ్యగా అతను గ్రామస్తులతో కలిసి కారును రోడ్డుపై నిలిపివేశారు. కారులో ఉన్న ఓ మహిళ, డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు. బైక్‌లపై కారును వెంబడించిన యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చి కారును అప్పగించారు. కుటుంబానికి పెద్ద దిక్కు మృత్యువాత పడటంతో కుటుంబీకులు శోక సంద్రంలో మునిగారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి శవ పంచానామ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం
మోయినుద్దీన్‌కు ఇద్దరు భార్యలు, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరు భార్యలు మృతి చెందగా.. కొడుకులు కూలీ పనులు చేస్తున్నారు. ఇతర ఆదాయ వనరులు లేకపోవడంతో కుటుంబం అంతా తండ్రి సంపాదనపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆ పిల్లలు అనాథలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment