
నిందితుడు క్యాబ్ డ్రైవర్ ప్రజాపత్ సురేష్, నేరస్థుడు ఆవుల గిడ్డయ్య
సాక్షి, సిటీబ్యూరో : రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి ఠాణాలోని కాలనీలనే టార్గెట్‌గా చేసుకుని కారులో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ ప్రజాపత్ సురేష్‌ను మల్కాజ్‌గిరి సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడు గడిచిన ఐదు నెలల్లో ఆరు చోరీలు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన సురేష్ బతుకుతెరువు కోసం 1996లో నగరానికి వలసవచ్చాడు. చెంగిచెర్ల, మాణికేశ్వర్‌నగర్ ప్రాంతాల్లో స్వీట్‌షాప్‌లు ఏర్పాటు చేశాడు. మద్యం సహా అనేక వ్యసనాలకు బానిసైన సురేష్ ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు. వీటి నుంచి బయటపడటంతో పాటు జల్సాల కోసం స్వీట్‌షాపులను అమ్మేశాడు. ఆపై ఓ కారు కొనుక్కుని డ్రైవర్‌గా మారినప్పటికీ ఆ ఆదాయంతో సంతృప్తి చెందలేదు.
తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన చుట్టు పక్కల ప్రాంతాల్లో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. మేడిపల్లిలోని పీర్జాదిగూడలో నివసించే ఇతగాడు ఈ ఏడాది కేవలం ఐదు నెలల్లో ఆరు నేరాలు చేశాడు. అర్ధరాత్రి వేళ తన కారులో తిరుగుతూ తాళం వేసున్న ఇళ్లను గుర్తించేవాడు. తన వాహనాన్ని ఆ ఇంటికి కొంతదూరంలో ఆపి వచ్చేవాడు. ప్రధాన ద్వారానికి ఉన్న తాళం పగులకొట్టడం ద్వారా లోపలికి ప్రవేశించి అందినకాడికి ఎత్తుకుపోయేవాడు. ఇతడి కదలికలపై సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి సీసీఎస్ పోలీసులు శుక్రవారం వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి 21.5 తులాల బంగారు, 18.5 తులాల వెండి ఆభరణాలు, ల్యాప్‌టాప్, ట్యాబ్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు.
ఘరానా దొంగపై పీడీ యాక్ట్
రాచకొండ కమిషనరేట్ పరిధికి చెందిన ఘరానా దొంగ ఆవుల గిడ్డయ్యపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ శుక్ర వారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లా నుంచి వచ్చి మల్కాజ్‌గిరి ప్రాంతంలో స్ధిరపడిన గిడ్డయ్య వరుస నేరాలు చేస్తున్నాడు. 2017–18ల్లోనే 28 చోరీలు చేశాడు. నేరేడ్‌మెట్, మల్కాజ్‌గిరి, కీసర, మేడిపల్లిల్లో పంజా విసిరాడు. గత నెలలో నేరేడ్‌మెట్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇతడి నేర చరిత్రను పరిగణలోకి తీసుకున్న పోలీసు కమిషనర్ పీడీ యాక్ట్ ప్రయోగించారు.