సాక్షి, హైదరాబాద్: లేటు వయస్సులో వారసుడిని కనాలని భావించాడు ఓ వృద్ధుడు. ఈ మేరకు సరోగసి ద్వారా బిడ్డను కనివ్వాలని.. ఓ మహిళతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంతలో అతడికి వక్రబుద్ధి పుట్టింది. ‘సరోగసీ కాదు.. నాతో సహజీవనం చేసి బిడ్డను కనిస్తావా’ అంటూ ఆమెను వేధించసాగాడు. ఆఖరికి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాలపాలయ్యాడు. వివరాలు... సోమాజిగూడ, ధృవతార అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న సూరప్ప రాజు (64)కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు కావాలన్న కోరికతో మధ్యవర్తి నూర్ అనే మహిళ ద్వారా పోచమ్మబస్తీకి చెందిన ఓ మహిళ(22)ను పరిచయం చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సదరు మహిళ సరోగసి ద్వారా గర్భందాల్చి పుట్టిన బిడ్డను ఇచ్చేందుకు అంగీకరించింది.
ఈ మేరకు రూ.4.5 లక్షలు ఇస్తానని, గర్భవతిగా ఉన్న సమయంలో ప్రతి నెల రూ.10వేలు పంపిస్తానని సూరప్ప రాజు గతేడాది డిసెంబర్ 24న ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి అవసరమైన పరీక్షలు చేయించాడు. ఈ నెల 11న రాజు సదరు మహిళను కారులో బిర్లామందిర్ తీసుకెళ్లాడు. దేవుని దర్శనం అనంతరం తనతో గడిపిన అనంతరం పిల్లల్ని కనాలని రూ.4.5 లక్షలకు అదనంగా మరో రూ. 50వేలు ఇస్తానని బలవంతం చేశాడు. అయితే ఆమె అందుకు అంగీకరించకుండా ఇంటికి వెళ్లిపోయింది. దీంతో గత వారం రోజులుగా రాజు ఆమెకు ఫోన్ చేసి తనతో గడిపేందుకు ఒప్పుకోవాలని వేధింపులు, బెదిరింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాధితురాలు ఈ విషయాన్ని తన భర్తకు దృష్టికి తీసుకెళ్లింది. బుధవారం రాత్రి ఇద్దరు కలిసి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సూరప్ప రాజును అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment