సాక్షి, విజయవాడ : అనుమానం పెనుభూతంగా మారిన భర్త గర్భిణి అని కూడా చూడకుండా నిద్రిస్తున్న భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి కిరాతకంగా హతమార్చిన ఘటన కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫకీర్‌గూడెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లా కోడూరు గ్రామానికి చెందిన ముక్కా శైలజ (32) కు గుడివాడ సమీపంలోని జొన్నపాడు గ్రామానికి చెందిన నంబియార్ (35) తో వివాహమైంది. నగరంలోని ఫకీర్‌గూడెం రావిచెట్టు సెంటర్‌లో వారు నివాసం ఉంటున్నారు.
భార్య బీఎస్సీ, బీఈడీ చదివి నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయినిగా పని చేస్తోంది. ఎమ్సెస్సీ బీఈడీ చదివిన భర్త ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. కొద్ది రోజులు సజావుగా సాగిన వారి సంసారంలోకి అనుమానం అనే భూతం భర్త మనస్సును ఆవరించింది. అప్పటి నుంచి ప్రతి రోజు భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకొని ఆమెను ఇబ్బందులకు గురి చేస్తూ వేధించడం మొదలుపెట్టాడు. రోజు రోజుకు ప్రవర్తనపై అనుమానం పెరిగిపోయి, ఆమెను ఎలాగైనా మట్టుపెట్టాలని నిశ్చయించుకుని అందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం బాటిల్‌లో పెట్రోలు తీసుకువచ్చి ఇంట్లో భద్రపరిచాడు. రాత్రి భోజనాల అనంతరం బెడ్‌రూంలో నిద్రించిన సమయంలో అదను కోసం వేచి చూసిన భర్త తెల్లవారుజామున 4.45 గంటలకు ముందుగానే తెచ్చుకున్న పెట్రోలును నిద్రిస్తున్న భార్యపై పోసి నిప్పు అంటించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆమె గట్టిగా కేకలు పెడుతూ కాలిపోయింది. ఆమె మెలకువ వచ్చి అరుపులతో చుట్టుపక్కల వారు రావటంతో తనపై అనుమానం రాకుండా ఉండేందుకు భార్యను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు నటించాడు.
ఈ క్రమంలో అతనికి స్పల్ప గాయాలు కూడా అయ్యాయి. దీంతో స్థానికులు మంటలను ఆర్పివేసి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్‌లు నిర్థారించారు. మృతురాలు మూడు నెలల గర్భవతి అని తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు, బంధువుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా హత్యాయత్నం చేసింది తానేనని అంగీకరించాడు. దీనిపై సీఐ పి.రామచంద్రరావు నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment