భార్య సాయిలక్ష్మితో సాయిప్రసన్న
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): స్నేహితులతో సరదాగా శివరాత్రి జాగరణ చేశాడు... అనంతరం సముద్రంలో స్నానానికి వెళ్లాడు... ఇంతలో మృత్యుదేవత బలమైన కెరటం రూపంలో సముద్రంలోకి లాక్కుపోవడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు... కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిల్చిన దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జీవీఎంసీ 17వ వార్డులోని పెదజాలారిపేట బాపూజీనగర్‌కి చెందిన వాడమోదుల సత్యసాయి ప్రసన్న (30) పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తండ్రి సుందరరావు గతంలో చనిపోయారు. దీంతో తల్లి పద్మాదేవితో కలిసి బాపూజీనగర్‌లో నివసిస్తున్నాడు. పెదజాలారిపేటకు చెందిన సాయిలక్ష్మితో గత ఏడాది నవంబర్ 10న వివాహం జరిగింది. సోమవారం శివరాత్రి జాగరణ చేసిన సాయిప్రసన్న ఆరుగురు స్నేహితులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కిర్లంపూడి లే అవుట్‌లోని వైఎంసీఏ ఎదురుగా గల బీచ్‌లో స్నానానికి దిగాడు. ఇంతలో బలమైన కెరటాలు ఒక్కసారిగా యువకులందరినీ లాక్కుపోయాయి. వారంతా హాహాకారాలు చేయడంతో సమీపంలోని గజ ఈతగాళ్లు ఆరుగురు యువకులనూ రక్షించి ఒడ్డుకి చేర్చారు. అయితే అప్పటికే సాయిప్రసన్న మరణించడంతో తోటి స్నేహితులు బోరున విలపించారు. అప్పటివరకు తమతో ఆడిపాడిన స్నేహితుడు విగతజీవిగా మారడంతో కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న మూడో పట్టణ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. సాయిప్రసన్న మరణంతో బాపూజీనగర్‌లో విషాదం నెలకొంది.
పెళ్లైన నాలుగు నెలలకే
సాయిప్రసన్నకు నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. పెదజాలారిపేటకు చెందిన సాయిలక్ష్మితో గత ఏడాది నవంబర్‌లో వివాహం జరిగింది. సాయిలక్ష్మి ప్రస్తుతం మూడు నెలల గర్భవతి. భర్త చనిపోయాడని తెలియడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడిపెట్టించింది. సమాచారం తెలిసిన వెంటనే చుట్టుపక్కల ప్రజలు, ఆమె బంధువులు బాపూజీనగర్‌లో గల సాయిప్రసన్న ఇంటికి చేరుకున్నారు. ఎప్పుడూ అందరితో కలుపుగోలుగా ఉండే సాయిప్రసన్న మరణించాడంటే నమ్మలేకపోతున్నామని విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మూడో పట్టణ సీఐ ఆర్.అప్పలనాయుడు పర్యవేక్షణలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment