![Man Died By Heart Attack - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/28/man.jpg.webp?itok=6h-VAkrN)
మృతుడు సుధాకర్‌రెడ్డి
సాక్షి, భూపాలపల్లి : గణపురం మండలం గాంధీనగర్‌లోని డాంబర్ ప్లాంట్(పటేల్ కన్‌స్ట్రక్షన్)లో మరెపల్లి సుధాకర్‌రెడ్డి(డ్రైవర్) అనే కార్మికుడి మృతి ఘర్షణకు దారి తీసింది. అతడు సోమవా రం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడని కంపెనీ యాజమాన్యం చెబుతుండగా.. కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే మరణించాడని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. సుధాకర్ మృతి చెందిన విషయాన్ని సాయంత్రం వరకు తమకు తెలియనీయలేదని వారు ఆరోపించారు. ఇదిలా ఉంటే సాయంత్రం పెద్ద సంఖ్యలో చేరిన మృతుడి బంధువులు ఆగ్రహంలో ఘర్షణకు దిగారు. కంపెనీ కార్యాలయంపై దాడి చేశారు.
విలేకరులపై దాడి
విషయం తెలిసిన పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన విలేకరులు సంఘటన వివరాలు సేకరించేందుకు వెళ్లారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న సుధాకర్‌రెడ్డి బంధువులు పత్రికా ప్రతినిధులను కంపెనీకి చెందినవారనుకుని మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో విలేకరుల్లో కొంత మంది తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. దాడి జరిగిన ప్రదేశంలో ములుగు సీఐ సాయిరమణతో పాటు గణపురం ఎస్సై ఫణి ఉన్నట్టు సమాచారం. వీరు ఉండగానే దాడి జరిగిందని స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment