పిల్లలతో బాధితురాలు
సాక్షి, నంద్యాల : చేసిన అప్పు తీర్చడం కోసం భార్యాబిడ్డలను అమ్మకానికి పెట్టిన ఓ కసాయి ఉదంతం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా నంద్యాల అర్బన్ ఐసీడీఎస్ సీడీపీవో ఆగ్నేష్ ఏంజల్, బాధితురాలు వెంకటమ్మ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోవెలకుంట్ల పట్టణం బుడగజంగాల కాలనీకి చెందిన పసుపులేటి మద్దిలేటి (36)కి నంద్యాల పట్టణంలోని వైఎస్సార్‌నగర్‌కు చెందిన వెంకటమ్మ(30)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భర్త మద్దిలేటి మద్యానికి బానిసై అప్పులు చేశాడు.
ఈ అప్పులు తీర్చడానికి భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో.. రెండో కుమార్తె(13)ను రూ.1.50 లక్షలకు తన దూరపు బంధువుకు అమ్మేశాడు. అంతటితో ఆగకుండా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని జులాయిగా తిరుగుతూ సుమారు రూ.15 లక్షలు అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చడానికి తన భార్యను సైతం రూ.5 లక్షలకు తన చిన్నన్నకు అమ్మకానికి పెట్టాడు. ‘నువ్వు సంతకం చేస్తే మా అన్న నాకు డబ్బులు ఇస్తాడు’ అంటూ భార్యను వే«ధించసాగాడు. దీంతో ఆమె కోవెలకుంట్ల నుంచి నంద్యాలలోని తన తల్లి వద్దకు వచ్చేసింది. ఇక్కడికి వచ్చినా మద్దిలేటి పిల్లలను తన వెంట పంపించాలని వేధించసాగాడు.
దీంతో బాధితురాలు వెంకటమ్మ, ఐసీడీఎస్ సీడీపీవో ఆగ్నేష్ ఏంజల్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శారదకు విషయం తెలిపింది. తన రెండో కుమార్తెను బంధువులకు అమ్మాడని, ఆ పత్రాలు బుజ్జి అనే వ్యక్తి వద్ద ఉన్నాయని, వాటిని ఇప్పించాలని బాధితురాలు కోరింది. ఈ మేరకు బాధితురాలితో రాత పూర్వకంగా రాయించుకున్న ఐసీడీఎస్ అధికారులు పిల్లలను ఆళ్లగడ్డలోని బాలికల పాఠశాలలో చేర్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రమేష్‌బాబు మాట్లాడుతూ పదిరోజుల క్రితం తన భర్త, బావ వేధిస్తున్నారని వెంకటమ్మ ఫిర్యాదు చేసిందని, ఈ విషయం ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లో ఉందని చెప్పారు. బాధితురాలి భర్త, బావలను పిలిపించి విచారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment