
మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ, ఎస్సై చెట్టుకు వేలాడుతున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
తూర్పుగోదావరి, గండేపల్లి (జగ్గంపేట): జాతీయరహదారిపై పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో గుర్తు తెలియని మృతదేహాన్ని ఆదివారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. రోడ్డు పక్కన చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు, ప్రయాణికులు, వాహనచోదకులు భయభ్రాంతులకు గురయ్యారు. జగ్గంపేట సీఐ రాంబాబు, ఎస్సై ఏసుబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు. మృతుడు నీలం రంగు ప్యాంట్ ధరించాడని, చామనఛాయలో 5.8 ఎత్తు, సుమారు 40 నుంచి 50 వయసు ఉంటుందన్నారు. ఆచూకీ తెలిసినవారు సమాచారం అందజేయాలని కోరారు.
మృతిపై పలు అనుమానాలు
ఈ గుర్తు తెలియని వ్యక్తిది హత్య? ఆత్మహత్య? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తలపై గాయం, మృతుని కుడిచేయి చెట్టుకు ఉన్న రెండు పలవల మధ్యలో ఉంది. ఎవరైనా హతమార్చి ఇక్కడ ఆత్మహత్యగా చిత్రీకరించేందుకే ప్రయత్నించారా? అన్న అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. టీషర్ట్‌తోనే మృతదేహం చెట్టుకు వేలాడుతుండటంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. అయితే మానసిక ఒత్తిడి, ఆర్థిక, అనారోగ్య పరిస్థితులతో ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎసై పాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment