భార్య క్రాంతితో మృతుడు రాంబాబు (ఫైల్)
తూర్పు గోదావరి ,రామచంద్రపురం: ముఖమంతా రక్తంతో.. అనుమానస్పదంగా ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన రామచంద్రపురం పట్టణంలో ఆదివారం సంచలనం కలిగించింది. మృతుని బంధువులు, సన్నిహితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని తోటవారి వీధికి చెందిన చెల్లూరి రాంబాబు( 38), అదే వీధిలో నివసించే క్రాంతిని 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. రాంబాబుపై గతంలో రామచంద్రపురం పోలీసుస్టేషన్‌లో రౌడ్‌షీట్ నమోదయ్యింది. ఇటీవల టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దానిని ఎత్తివేశారు. ఏడాది కాలంగా భార్యాభర్తల మధ్య కాపురంలో గొడవలు ఏర్పడ్డాయి. ఇరువురూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు.
స్థానిక డీఎస్పీ కార్యాలయంలో వీరికి ఫ్యామిలీ కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అనంతరం స్థానిక తోటవారి వీధిలో గల ఒక అపార్టుమెంట్‌లో వారు కాపురం ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం రాంబాబు భార్య క్రాంతి తన భర్త మంచం మీద నుంచి లేవలేదని, నోట్లో నుంచి రక్తం వస్తోందని చెప్పటంతో స్థానికులు అతనిని హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. స్థానికంగా ఎస్సై, సీఐలు లేకపోవటంతో ద్రాక్షారామ ఎస్సై సతీష్, మండపేట రూరల్ సీఐలక్ష్మణ రెడ్డి ఆసుపత్రి వద్దకు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. రామచంద్రపురం ఆదనపు ఎస్సై ఆర్. వెంకటేశ్వరరావు మృతుడి తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు. క్రాంతిని అదుపులోకి తీసుకున్నారు.
మిస్టరీగా మారిన మరణం
తాను ఉంటున్న ప్లాట్‌లోనే మంచంపై నోట్లో రక్తం వస్తూ రాంబాబు మృతి చెందటం మిస్టరీగా మారింది. ఆసుపత్రికి తరలించే సమయానికే రాంబాబు మృతి చెందగా అర్థరాత్రి దాటిన తరువాతనే మరణించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ మంతా రక్తంతో ఉండటం, తాను నిద్రించిన మంచంపైన కూడా రక్తపు మరకలు ఉండటం తో రాంబాబు మృతిపై పలు అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. తన కుమారుడిని కోడలు క్రాంతి చంపేసిందంటూ రాంబాబు తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయటం దీనికి బలం చేకూరుస్తోంది.
ఆ డబ్బే కారణమా...?
ఈ మధ్య రాంబాబుకు రూ.25లక్షల వరకు చేతికందినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఆ డబ్బుతో తోటవారివీధిలో ఒక స్థలాన్ని రాంబాబు కొనుగోలు చేసేందుకు ఆదివారం అగ్రిమెంటు చేసుకోవాల్సి ఉంది. దాని కోసం రూ.16 లక్షలు తీసుకువచ్చి ఇంట్లో ఉంచినట్టు తెలుస్తోంది. తన పేరునే ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలని భార్య క్రాంతి ఒత్తిడి తీసుకువచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి వారిద్దరి మధ్య గొడవలు జరిగి ఉండవచ్చని, అదే రాంబాబు మృతికి కారణం అయ్యి ఉండవచ్చనే అనుమానాలున్నాయి. కాగా రాంబాబు తెచ్చిన సొమ్ములు మాయమైనట్టు తెలుస్తోంది. పోలీసులు క్రాంతిని, ఇతర కుటుంబసభ్యులను విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment