గంజాయి ముఠాను కదిరి పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పార్థసారిథి కాలనీలో ప్రస్తుతం కాపురముంటున్న మంజునాథ్, విశాఖపట్నం జిల్లా సంకడ గ్రామానికి చెందిన కసరాజు నూకాలమ్మ, లోసుల ఈశ్వరమ్మ, గంటె మాణిక్యంలు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. విశాఖ జిల్లాకు చెందిన మరో కీలక నిందితుడు లక్ష్మయ్య పరారీలో ఉన్నారు. ఇందుకు సంబందించిన వివరాలను కదిరి సీఐ గోరంట్ల మాధవ్ తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు.
కదిరి:యువత గంజాయి మత్తుకు అలవాటు పడి, తమ జీవితాన్ని నా«శనం చేసుకుంటోంది. గంజాయి అక్రమ రవాణాలతో పాటు అమ్మకాలపై ఇటీవల ‘సాక్షి’ పత్రిక ‘దమ్మారో..ధమ్..’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ఎస్పీ అశోక్‌కుమార్ స్పందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీలక్ష్మి, సీఐ గోరంట్ల మాధవ్, ఎస్‌ఐ హేమంత్‌లు గంజాయిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రయాణికుల రూపంలో విశాఖపట్నం జిల్లా సంకడ గ్రామానికి చెందిన వారు అక్కడి నుంచి గంజాయి తీసుకొచ్చి కదిరి పట్టణంలోని పార్థసారథి కాలనీలో ఉన్న మంజునాథ్‌కు అందజేసేవారు. ఇతను పట్టణంలోని పలు ప్రాంతాల్లో అమ్మడంతో పాటు కొన్ని కళాశాలల వద్ద కూడా యువతను గంజాయికి బానిస చేశాడు.
ఇలా కొంత కాలంగా ఈ వ్యాపారం నడుస్తోంది. శుక్రవారం పార్థసారథి కాలనీ సమీపంలోని కంప చెట్ల వద్ద విశాఖకు చెందిన ఆ ముగ్గురు మహిళలు తమ వెంట తెచ్చిన గంజాయిని మంజునాథ్‌కు స్వాధీనం చేస్తున్నట్లు డీఎస్పీకి సమాచారం రావడంతో వెంటనే సీఐ, ఎస్‌ఐలు తమ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ నలుగురినీ అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.5 కిలోల గంజాయితో పాటు రూ.1500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి అక్రమ రవాణా, అమ్మకాల వెనుక విశాఖపట్నం జిల్లా సంకడ గ్రామం దొరకొండకు చెందిన కీలక నిందితుడు లక్ష్మయ్య పరారీలో ఉన్నాడు. అతడిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ గోరంట్ల మాధవ్ తెలిపారు. గంజాయి అక్రమంగా తరలించినా, క్రయ, విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా గంజాయికి యువత దూరంగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment