
అర్షియా మృతదేహం
గచ్చిబౌలి: అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ భర్త, పిల్లలను గదిలో ఉంచి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ధర్మేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్‌చెరువు, గోకుల్‌నగర్ చెందిన అర్షియా అంజుమ్(23)కు మసీద్‌బండకు చెందిన అమ్జాద్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు ఐమాన్(3), కుమార్తె అర్ఫియా అంజుమ్ ఉన్నారు. బుధవారం భార్యాభర్తల మధ్య గొడవజరగడంతో క్షణికావేశానికి లోనైన అర్షియా అంజుమ్ భర్త, పిల్లలు బెడ్‌రూమ్‌లో ఉండగా బయటి నుంచి గడియ పెట్టి హాల్‌లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గదిలో నుంచి భర్త కేకలు వేస్తూ వారించినా ఆమె పట్టించుకోకపోవడంతో పైఅంతస్తులో ఉంటున్న అన్న, వదినలు అజ్మత్, గౌసియాలకు ఫోన్ చేసి సమాచారం అందించారు.
వారు కిందకు వచ్చి చూడగా మెయిన్‌డోర్‌కు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న అర్షియాను కిందికు దించి కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్త ఖుమ్రూ, బావ అజ్మత్, తోటి కోడలు గౌసియా వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి ఖదీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య,భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, కొద్ది రోజుల క్రితం పెద్ద సమక్షంలో పంచాయతీ చేసి సర్ది చెప్పామన్నారు. అయినా అర్షియాను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment