మృతురాలు మేరీ ,మృతుడు రాజు
కృష్ణాజిల్లా, కైకలూరు : ఓ వివాహిత తప్పటడుగు వేసి ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ సబంధం రట్టుకావడంతో పరువుపోయిందని పురుగుమందు తాగి ఆత్మహత్యచేసుకుంది. ఆమెను చూసిన యువకుడు కూడా పురుగుమందు తాగి ప్రాణాలు వదిలాడు. ఫలితంగా ఇద్దరు చిన్నారులు తల్లిప్రేమకు దూరమయ్యారు. కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా కోనాలపల్లికి చెందిన యాదాల మేరి (21)కి అదే జిల్లా దూసనపూడికి చెందిన యువకుడితో ఆరేళ్ల కిత్రం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని బొండాడలంక మేకల దిబ్బలో చేపల చెరువుకు మేరి భర్త కాపలదారునిగా పనిచేస్తున్నాడు.
ఆరు నెలల క్రితం అతని కుటుంబం పాలకొల్లు మండలం చింతపర్రులో ఉంటున్న వర్థనపు రాజు మేనకోడలి వివాహానికి వెళ్లింది. ఆ సమయంలో రాజుతో మేరికి పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. తొమ్మిది రోజుల క్రితం మేరీ తన పిల్లలను తీసుకుని రాజుతో ఇంటి నుంచి వెళ్లి పోయింది. మూడు రోజుల క్రితం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. మంగళవారం రాజు సోదరుడు మరో ఇద్దరు కలసి కొల్లేటికోట వచ్చారు. అక్కడ రాజు కనిపించడంతో ఇంటికి రావాలని కోరాడు. ఇంతలో తమ విషయం బయటకు తెలుస్తుందన్న భయంతో మేరీ తమతో తెచ్చుకున్న సీసాలోని పురుగుమందు కొంచెం తాగింది. రాజు మిగిలిన పురుగుమందు తాగాడు. వారిని 108 వాహనంలో కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. దీంతో చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. వారి అమాయక చూపులు స్థానికులను కంట తడిపెట్టించాయి. కైకలూరు రూరల్ ఎస్‌ఐ సిహెచ్.సతీష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment