
భర్త, కుమారుడితో నాగమణి(ఫైల్)
రాంగోపాల్‌పేట్, తార్నాక: అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బాలాజీనగర్‌కు చెందిన బలరాం, లక్ష్మిబాయిల కుమార్తె నాగమణి (34)కి సీతాఫల్‌మండి రవీంద్రనగర్‌కు చెందిన మారుతికుమార్‌తో 2014లో వివాహం జరిగింది. నాగమణి తిరుమలగిరి ఎమ్మార్వో కార్యాలయంలో వీఆర్‌ఏగా పనిచేసేది. పెళ్లి సమయంలో రూ.రెండు లక్షల నగదు, రూ.లక్ష విలువైన బంగారు నగలు ఇచ్చారు. వీరికి కుమారుడు(3) ఉన్నాడు. మారుతి కుమార్ లండన్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా నాగమణి కొద్ది నెలల క్రితం డిప్యూటేషన్‌పై సికింద్రాబాద్ ఆర్డీవో కార్యాలయానికి వచ్చింది.
పెళ్లైనప్పటినుంచి వేధింపులు
పెళ్లైన తర్వాత కొద్ది రోజుల నుంచే నాగమణిని ఆమె అత్త, మామలు, ఆడపడుచు వేధింపులకు గురిచేస్తున్నారు. అదనపు కట్నం తేవాలని తరచూ వేధించేవారు. భర్త మారుతికుమార్ కూడా వేధింపులకు గురి చేసేవాడని తెలిపారు.
కుమారుడికి అనారోగ్యంతో...
ఇటీవల ఆమె కుమారుడు అనారోగ్యంతో బాధపడుతుండటంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చూపించగా శస్త్ర చికిత్సకు సుమారు రూ.7లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఇటీవల లండన్ నుంచి వచ్చిన భర్త్త, అత్త, మామ సదరు డబ్బు పుట్టింటి నుంచి డబ్బు తేవాలని ఆమెపై ఒత్తిడి తెస్తుండటంతో మనస్తాపానికిలోనైన నాగమణి ఈ నెల 15న రాత్రి ఆర్పిక్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది.
‘అత్తింటి వారే చంపేశారు’
నాగమణిని ఆమె భర్త, అత్త, మామలే బలవంతంగా ఆర్పిక్ తాగించి చంపేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గురువారం వారు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆమె అత్తామామలపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment