
మంజుల మృతదేహం , మంజుల, మానస (ఫైల్)
చిలకలగూడ: కుమార్తె మృతిని తట్టుకోలేక ఓ మహిళ భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన గురువారం సికింద్రాబాద్, చిలకలగూడ ఠాణా పరిధిలోని దూద్‌బావిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దూద్‌బావి, పద్మావతి ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న మనోహర్‌బాబు, మంజుల దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. వీరి కుమార్తె మానస (12) సికింద్రాబాద్ కీస్ హైస్కూలులో ఏడో తరగతి చదువుతోంది. గత కొన్నాళ్లుగా ఆమె ఆస్తమా, గుండె సంబంధ వ్యాధితో బాధపడుతోంది. బుధవారం ఉదయం మానస గుండెపోటుతో మృతి చెందింది. కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేక మనస్తాపానికి లోనైన మంజుల గురువారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో భవనం నాల్గో అంతస్తు పైకి ఎక్కి కిందికు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రక్తపు మడుగులో పడి ఉన్న మంజులను గుర్తించిన స్థానికులు ఆమెను ఆటోలో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రాణంగా చూసుకునేది...
కుమార్తె మరణాన్ని తట్టుకోలేకే మంజుల ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు, అపార్ట్‌మెంట్‌వాసులు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న మానసను గాజుబొమ్మలా చూసుకునేదన్నారు. బుధవారం ఉదయం మానస స్కూల్‌కు వెళ్లనని చెబితే తల్లి ఎంతగానో తల్లడిల్లిందని, బిడ్డను దగ్గరికి తీసుకుని సపర్యలు చేసిందన్నారు. బు«ధవారం మానస గుండెపోటుతో తల్లి చేతుల్లోనే ప్రాణాలు విడవడంతో ఆమె జీర్ణించుకోలేకపోయిందని, కుమార్తె లేకుండా తాను బతకలేనని, తానూ కూడా బిడ్డ వద్దకే వెళతానని బోరున విలపించిందన్నారు. తాము ఎంతో నచ్చజెప్పామని, అయితే ఇంతలోనే అఘాయిత్యానికి పాల్పడుతుందనుకోలేదని బంధువులు విలపించారు. గురువారం ఉదయం భవనంపైకి వెళ్తుంటే దుస్తులు ఆరేసేందుకు వెళుతుందనుకున్నామని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుందనుకోలేదని వారు కన్నీటిపర్యంతమయ్యారు. మృతురాలి భర్త మనోహర్‌బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్ ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.
అమ్మ తిట్టిందని..మనస్తాపంతో బాలుడి ఆత్మహత్య
బాలానగర్: సెల్‌ఫోన్ విషయంలో తల్లి మందలించటంతో మనస్తాపానికిలోనైన ఓ బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ వాహిదుద్దీన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫిరోజ్‌గూడలో ఉంటున్న సత్యవరపు సుశీలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల సుశీల కుమార్తెకు సెల్‌ఫోన్ కొనిచ్చింది. గురువారం సెల్‌ఫోన్‌తో కుమారుడు కార్తీక్ (15) ఆడుకుంటున్నాడు. అయితే అతడి సోదరి ప్రాజెక్టు పని ఉందని సెల్‌ఫోన్ ఇవ్వాలని తమ్ముడిని కోరగా, కార్తీక్ అందుకు నిరాకరించాడు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న సుశీల కుమారుడిని మందలించి సెల్‌ఫోన్ ఇప్పించింది. మధ్యాహ్నం కుమార్తెకు టిఫిక్ బాక్స్ ఇచ్చేందుకు బయటికి వెళ్లిన సుశీల ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులు లోపలి నుంచి గడియ వేసి ఉన్నాయి. తలుపులు కొట్టినా కార్తీక్ తెరవకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె స్థానికులతో కలిసి పక్కింటి బాల్కనీలోనుంచి చూడగా కార్తీక్ బెడ్ రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో తలుపులు బద్ధలు కొట్టి కార్తీక్‌ను కిందకు దింపి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుడి తల్లి సుశీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment