
ధనమ్మ మృతదేహం
సూర్యాపేట క్రైం : అనుమానస్పదస్థితిలో ఓ వివాహిత మృతిచెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని ఈద్గారోడ్డులో నివాసముంటున్న కుడకుడ రెండో ఏఎన్‌ఎం ధనమ్మ (33) సోమవారం తెల్లవారుజామున తను నివాసముండే ఇంట్లోనే విగతజీవిగా మారింది. చివ్వెంల మండలం జయరాంగుడితండాకు చెందిన గుగులోతు సుందర్– రుక్కమ్మ దంపతుల కుమార్తె గుగులోతు ధనమ్మ. ఈమె పదేళ్ల క్రితం సూర్యాపేట పట్టణానికి చెందిన జావిద్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహ సమయంలో జావిద్‌కు జయరాంగుడితండాలో వ్యవసాయ భూమితో పాటు రూ.17 లక్షల నగదు, సొత్తు రూపంలో ముట్టజెప్పారు. వీరు పట్టణంలోని ఈద్గారోడ్డులో నివాసముంటున్నారు.
అయితే జావిద్ తుంగతుర్తి ఎక్సైజ్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా.. ధనమ్మ చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలోని పీహెచ్‌సీలో రెండో ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. పది రోజులుగా ఇద్దరూ ఉద్యోగాలకు సెలవు పెట్టారు. ఇంటి వద్దనే ఉండడంతో జావిద్‌కు వరుస అయిన చిన్నమ్మ శనివారం రాత్రి వీరు నివాసముంటున్న ఇంటికి వచ్చింది. ఆమె జావిద్‌ను డబ్బులు ఇవ్వాలి కదా.. ఎప్పుడు ఇస్తావని ప్రశ్నించింది. దీంతో ధనమ్మ ఆమెకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి.. ఎప్పుడు ఇచ్చిందంటూ.. గొడవకు దిగింది. అయినా కొన్నేళ్లుగా వారితో మనకు దూరం ఉండగా ఇప్పుడు ఎందుకు వస్తుందని ప్రశ్నించింది. ఇద్దరి మధ్య ఘర్షణ కాస్త.. ధనమ్మ ప్రాణాలు వదిలేలా చేసింది. వీరికి ఎనిమిదేళ్ల వయసు కలిగిన బాబు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ధనమ్మ తల్లి రుక్కమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ధనమ్మ మృతదేహాన్ని సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు. అయితే పోస్టుమార్టం అనంతరం ధనమ్మ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసేలా ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. జావిద్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
అతడే హతమార్చాడు
ధనమ్మను తన అల్లుడు జావిద్ కొట్టి చంపాడని తల్లిదండ్రులు , బంధువులు ఆరోపిస్తున్నారు.జావిద్ చిన్నమ్మ, అక్కలు వలన కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుందన్నారు. వివాహ సమయంలో కూడా జావిద్ కట్నం రూపేన రూ.20 లక్షల వరకు ముట్టజెప్పామన్నారు. జావిద్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment