కిడ్నాప్ చెర నుంచి తప్పించుకున్న శిరీష, ఆమె భర్త మహేష్, బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్న సీఐ
అన్నవరం(ప్రత్తిపాడు): అన్నవరంలో ఓ వివాహితను కిడ్నాప్ చేసేందుకు ఓ అగంతకుడు ప్రయత్నించగా ఆమె చాకచక్యంగా కారులో నుంచి దూకి తప్పించుకుంది. ఆ ఘటన వివరాలను గురువారం రాత్రి అన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ప్రత్తిపాడు సీఐ అద్దంకి శ్రీనివాసరావు ఇలా వెల్లడించారు. సామర్లకోట మండలం హుస్సేన్‌పురంలో ఉంటున్న ఏనుగుల శిరీషకు విశాఖ జిల్లా చింతపల్లికి చెందిన మహేష్‌తో ఏడాది క్రితం వివాహమైంది. శిరీష కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో చదువుతూ తన స్వగ్రామం హుస్సేన్‌పురంలోనే ఉంటూ రోజూ కాకినాడ కళాశాలకు వెళ్లి వస్తోంది. బుధవారం సాయంత్రం మహేష్ అన్నవరానికి చెందిన తన బంధువులకు చెందిన నీలి రంగు రెనాల్ట్ పల్స్ కారు(ఏపీ 5 బీడీ 1567)లో హుస్సేన్ పురం వెళ్లాడు.
అక్కడి నుంచి భార్యాభర్తలు ఇరువురు గురువారం ఉదయం అన్నవరంలోని శ్రీసత్యదేవుని ఆలయానికి వచ్చి స్వామివారి వ్రతమాచరించి దర్శనం చేసుకున్నారు. అనంతరం కొండ దిగువకు వచ్చి ఎస్‌బీఐ ఏటీఎం వద్ద కారు ఆపి తన బంధువులకు ఫోన్ చేసి కారు తీసుకెళ్లిపోమని చెప్పాడు. తరువాత ఆ కారు ఇంజిన్ ఆపకుండా మహేష్ అందులో నుంచి దిగి వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి వెళ్లాడు. ఈ లోపు ఓ అగంతకుడు ఆ కారు డ్రైవర్ సీటులోకి ఎక్కి అతి వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతుండడంతో మహేష్‌తో పాటు అతడి బంధువులు ఆ కారును ఆపేందుకు ప్రయత్నించారు. ఫలితం లేక మోటార్ సైకిల్‌పై వెంబడించారు. కారులో ఉన్న శిరీష కూడా గట్టిగా కేకలు వేస్తుండడంతో బెండపూడి వద్ద అగంతకుడు కారు ఆపాడు. ఆమె కారు డోర్ తీసుకుని కిందకు దూకేసింది. ఈ లోపు మహేష్, అతడి బంధువులు అక్కడికి చేరుకోవడంతో ఆ అగంతకుడు కారు వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. కారును ధర్మవరం వరకు వెంబడించిన మహేష్ బంధువులు ఆ తరువాత కారు ఆచూకీ తెలియక వెనుదిరిగారు.
అప్రమత్తమైన పోలీసులు
కిడ్నాప్ విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణవరం టోల్‌గేట్ సిబ్బందికి ఫోన్ చేసి కారును ఆపాలని సూచించారు. హైవే మీద అన్ని పోలీస్‌స్టేషన్‌లను అలర్ట్ చేశారు. గురువారం రాత్రి మహేష్, శిరీష, వారి బంధువుల నుంచి సీఈ శ్రీనివాసరావు పూర్తి వివరాలు సేకరించారు. త్వరలోనే ఆ నిందితుడిని పటుకుంటామని తెలిపారు. అగంతకుడు ముఖానికి గుడ్డ కట్టుకున్నాడని, కారులో తన ఫోన్, బ్యాగ్ ,పర్స్ ఉన్నాయని శిరీష తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment