స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్న సీఐ జయకుమార్, (అంతరచిత్రం) పస్తం నాగమ్మ (ఫైల్)
వత్సవాయి (జగ్గయ్యపేట) : ఓ వివాహిత మహిళ హత్యకు గురైన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మక్కపేట గ్రామానికి చెందిన పస్తం నాగమ్మ (32)కు ఖమ్మం జిల్లా పల్లిపాలెంకి చెందిన బొమ్మల రాంచంద్రుడుతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే, ఏడాదికే భార్యాభర్తల మధ్య కలహాలు రావడంతో విడిపోయారు. రాంచంద్రుడు వారి స్వగ్రామం వెళ్లిపోగా నాగమ్మ స్థానికంగా ఉంటోంది. బూరలు, చిన్నపాటి ఇత్తడి సామానులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది.
ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నుంచి నాగమ్మ కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం గోపినేనిపాలెం గ్రామం వెళ్లే రహదారి పక్కన ఉన్న సిమెంట్ ఇటుకల వెనుక నాగమ్మ మృతదేహం పడి ఒంటిపై ఎటువంటి దుస్తులు లేకుండా ఉంది. రక్షిత మంచినీటి సంప్‌వెల్ వద్ద మరమ్మతు పనులు చేస్తుండగా ఇటుకల కోసం కూలీలు వెళ్లగా మృతదేహం కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట సీఐ కేఎన్‌వీవీ జయకుమార్, ఎస్‌ఐ పి. ఉమామహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సిమెంట్ ఇటుకతో కొట్టి చంపినట్లు గుర్తించారు. పరిసరాలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని జగ్గయ్యపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శిరిగిరి వీరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమ సంబంధమే కారణమా?..
అక్రమ సంబంధమే హత్యకు కారణ మని అనుమానిస్తున్నారు. స్థానికంగా ఉండే ఓ యువకుడితో నాగమ్మ చనువుగా ఉండేదని పోలీసులకు కొందరు చెప్పారు. పోలీసుల విచారణలో కూడా అది నిర్థారణ అయ్యింది. అతనే మద్యం మత్తులో చంపి ఉంటాడనే కోణంలో విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment