
నిందితుడు సోహెల్
తార్నాక: మేనమామ కుమార్తెను వివాహమాడి ఆరునెలలకే వదిలేశాడు, కొద్దికాలానికే మరో యువతిని పెళ్లిచేసుకుని వారం రోజులకే వదిలేశాడు. ముచ్చటగా మూడోపెళ్లికి సిద్దమైన ఓ యువకుడు పోలీసులకు దొరికిపోయిన సంఘటన ఓయూ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఓయూ ఎస్‌ఐ నర్సింగరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్‌జిల్లా, రాంపల్లికి చెందిన మహ్మద్ సోహేల్(24) ప్రైవేటు ఉద్యోగి. 2016లో అతను తన మేనమామ కుమార్తెను వివాహం చేసుకుని ఆరు నెలలకే వదిలేశాడు. అనంతరం పీర్జాదిగూడకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్న అతను కేవలం వారం రోజులు మాత్రమే కాపురం చేసి వదిలేశాడు. నెల రోజుల క్రితం లాలాపేటలో ఓ యువతిని చూసిన అతను ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి కుదుర్చుకున్నాడు. ఈనెల 23న ఆమెతో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకోవడమేగాక వధువు తండ్రి నుంచి రూ.50వేలు కట్నంగా తీసుకున్నాడు. అయితే సదరు యువతి కుటుంబ సభ్యులు సోహెల్ గురించి వాకబుచేయగా, అతడికి ఇçప్పటికే రెండుపెళ్లిళ్లు జరిగినట్లు స్థానికులు చెప్పడంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment