కాకరపర్రు వద్ద గోదావరిలో మృతదేహాల కోసం గాలిస్తున్న దృశ్యం
పశ్చిమగోదావరి, పెరవలి: స్నానాల కోసం గోదావరిలో దిగిన యువకుల్లో ముగ్గురు గల్లంతైన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం 7 గంటల వరకు అధికారులు, మత్స్యకారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టడంతో ఎట్టకేలకు విడియాల వంశీ సాయినాథ్, విజ్జు సాయికిరణ్, ముత్యాల మణికంఠ మృతదేహాలు కాకరపర్రులో లభ్యమయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువజాము వరకు ఫ్లడ్‌లైట్‌లు ఏర్పాటుచేసి గాలించినా ఆచూకీ లభించలేదు. ఉదయం గాలింపు మరింత ఉధృతం చేయడంతో పాటు ఘటనా స్థలం వద్ద 10 మంది, కాకరపర్రు దిగువ నుంచి మరో 10 మంది వలలు వేస్తూ గాలించారు. ఎట్టకేలకు యువకులు గల్లంతైన ప్రాంతానికి 200 మీటర్ల దూరంలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాల కోసం బంధువులు, స్నేహితులు రాత్రి తెల్లవార్లు ఇసుకతెన్నెలపై ఎదురుచూస్తూ కన్నీటితో కాలం వెల్లదీశారు.
ఉదయం 7 గంటలకు..
ఉదయం 7 గంటలకు ఘటనా స్థలం నుంచి 200 మీటర్ల దూరంలో విడియాల వంశీ సాయినాథ్ మృతదేహం తొలుత లభ్యమైంది. తర్వాత విజ్జు సాయికిరణ్, ముత్యాల మణికంఠ మృతదేహాలు లభ్యమయ్యాయి. అధికారులు శవ పంచనామా నిర్వహించి మృతదేహాలను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బంధువుల ఆక్రందనలు
యువకుల మృతి చెందారన్న విషయం తెలియటంతో వారి బంధువులు పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలానికి వచ్చి కన్నీటిపర్యంతం అయ్యారు. తణుకు సీఐ డి.చైతన్య కృష్ణ చాకచక్యంగా వ్యవహరించటంతో పాటు ఎస్సై వి.జగదీశ్వరరావు, తహసీల్దార్ సీహెచ్ ఉదయభాస్కర్ ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ గాలింపు చర్యలు చేపట్టడంతో మృతదేహాల ఆచూకీ త్వరగా లభించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు.
ఉద్యోగంలో చేరాల్సి ఉండగా..
తాడేపల్లిగూడెం అర్బన్: వారం రోజుల్లో ఉద్యోగంలో చేరతాడని సంతోషిస్తున్న తల్లిదండ్రులకు తమ కుమారుడు మృత్యువాత పడటంతో తట్టుకోలేకపోతున్నారు. మంగళవారం పెరవలి మండలం కాకపరపర్రు వద్ద గోదావరి స్నానానికి వెళ్లిన నలుగురు యువకుల్లో ముగ్గురు మృతిచెందిన విషయం విధితమే. వారిలో వెజ్జు సాయికిరణ్ తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వెజ్జు పూర్ణచంద్రరావు, తులసీ దంపతుల ద్వితీ య కుమారుడు. సాయికిరణ్ యానిమేషన్ కోర్సును అభ్యసించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల విశాఖకి చెందిన సంస్థలో ఉద్యోగం రావడంతో ఈనెల 22న విధుల్లో చేరాల్సి ఉంది. ఈలోపు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. పూర్ణచంద్రరావు పట్టణంలో ప్యారాచూట్ హెయిర్ ఆయిల్ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. వ్యాపారరీత్యా వీరి కుటుంబానికి పట్టణమంతా స్నేహసంబంధాలు ఉండటంతో సాయికిరణ్ మృతితో విషాదఛాయలు అలముకున్నాయి. బుధవారం సాయికిరణ్ మృతదేహాన్ని స్వగృహానికి చేర్చడంతో సన్నిహితులు, బంధువులు, మిత్రులు నివాళులర్పించారు. అందరితో స్నేహపూర్వకంగా మెలిగిన స్నేహితుడు విగత జీవిగా మారడంతో వారంతా కంటతడి పెట్టారు. సాయికిరణ్ సోదరుడు దినేష్ విజయనగర్‌లోని రెడ్డి ల్యాబ్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment