![Mohanreddy victim was died - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/25/crrr.jpg.webp?itok=gVZ_q5SD)
కరీంనగర్ క్రైం: మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి బాధితుడు ఒకరు బుధవారం మృతి చెందాడు. రూ. 5 లక్షల అప్పు కింద రూ. కోటి విలువైన ఇంటిని కోల్పోయిన బాధితుడు మనోవేదనతోనే మృతి చెందినట్లు మోహన్‌రెడ్డి బాధిత సంఘంతో పాటు బంధువులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గోదాంగడ్డకు చెందిన ఎండీ గోరిమా తన భర్త ముజీబ్ వైద్యం కోసం హోంగార్డ్ పూదరి శ్రీనివాస్ ద్వారా మోహన్‌రెడ్డిని కలసి రూ. 5 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఇందుకోసం తన ఇంటిని మోహన్‌రెడ్డి తండ్రి ఆదిరెడ్డి పేరిట జీపీఏ చేయించింది. వడ్డీ రూపంలో రూ. 50 వేలు చెల్లించింది.
పూర్తి రుణం చెల్లించే పరిస్థితి లేకపోవడంతో మోహన్‌రెడ్డి, పూదరి శ్రీనివాస్, బొబ్బల మహేందర్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, బొబ్బల ఆదిరెడ్డిలు 2015 సెప్టెంబర్ 6న వచ్చి.. దంపతులను బెదిరించి సదరు ఇంటిని నిమ్మ మాలతి పేరిట సేల్‌డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇల్లు కూడా ఖాళీ చేయించారు. సుమారు రూ. కోటి విలువ చేసే ఇంటిని రూ. 5 లక్షల కింద పోగొట్టుకోవడంతో ముజీబ్ మనస్తాపానికి గురయ్యాడు. హైదరా బాద్ వెళ్లి ఆటో డ్రైవర్‌గా కొన్నాళ్లు పని చేశాడు. సోదరుడు చనిపోవటంతో తిరిగి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. మోహన్‌రెడ్డి అరెస్టు అయిన తర్వాత పలు నిరసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఇల్లు పోయిందన్న బెంగతో అనారోగ్యం పాలైన ముజీబ్ బుధవారం చనిపోయాడు. మోహన్‌రెడ్డి బాధితుల సంఘం సభ్యులు వెళ్లి నివాళులు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment