
జఫర్‌గఢ్ (స్టేషన్‌ఘన్‌పూర్): ఇంటి ముందు నిల్చున్న ఓ బాలికను పక్కింటి యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లి సమీపంలోని పాడుబడిన వ్యవసాయ బావిలో పడేశాడు. అతడు కూడా అందులో దూకి అత్యాచారానికి యత్నించాడు. బాలిక అరుపులు విన్న స్థానికులు ఆమెను రక్షించారు. ఈ ఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన బాలిక (17) హన్మకొండలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులు కావడంతో రెండు రోజుల క్రితమే ఇంటికి వచ్చింది.
ఆమె మధ్యాహ్నం ఇంటి ముందు నిల్చొని ఉండగా గమనించిన పక్కింటి యువకుడు కేశోజు రాజేష్‌చారి (23) వచ్చి ఆమెను బలవంతంగా ఎత్తుకుని రోడ్డు అవతలకు వెళ్తుండగా బాలిక పెద్ద పెట్టున కేకలు వేసింది. స్థానికులు విని వస్తుండగా రాజేష్‌చారి ఆ బాలికను సమీపంలోని పాడుబడిన బావిలో పడేశాడు. అతడు కూడా బావిలో దూకాడు. బాలిక తల, కాళ్లకు గాయాలైనప్పటికీ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అప్పటికే బావి వద్దకు చేరుకున్న స్థానికులు పైనుంచి అతడిని బెదిరించి బాలికను తాళ్ల సాయంతో పైకి లాగారు. గాయపడిన బాలికను వెంటనే 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని ఆస్పత్రికి తరలించే క్రమంలో గ్రామస్తులు అడ్డుకుని వాగ్వాదానికిదిగారు.
Comments
Please login to add a commentAdd a comment