
పసికందు మృతదేహంతో గడ్డం పూజిత ,అనిత(ఫైల్) ,పసికందుతో తండ్రి సతీశ్
కళ్లు తెరవకుండానే ఓ పసికందు మృతిచెందగా, పుట్టిన పది రోజులకే మరో శిశువు తల్లిని కోల్పోయింది. ఈ రెండు సంఘటనలు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో బుధవారం జరిగాయి. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ మగ బిడ్డ పురిట్లోనే మృతిచెందింది. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట చింతలవాడకు చెందిన గొడిసెల అనిత(26) పాపకు జన్మనిచ్చిన పది రోజులకు అనారోగ్యంతో కన్నుమూసింది.
కోరుట్ల: బాలింతగా ఉన్న ఆ తల్లి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చి అనారోగ్యానికి గురైంది.. చికిత్సకు డబ్బుల్లేని పేదరికంలో ఉండి దాతల సాయం ఆర్థించగా స్పందించేలోపు భర్త చేతుల్లో పసికందును ఉంచి కన్నుమూసింది. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట చింతలవాడలో గొడిసెల సతీశ్–అనిత(26) దంపతుల దీనగాథ ఇదీ.
గొడిసెల సతీశ్ కొంత కాలంగా పట్టణంలోని వెటర్నరీ కళాశాలలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తనకు వచ్చే అరకొర జీతంతో కుటుంబం గడుపుతున్న క్రమంలో అనిత గర్భం దాల్చింది. పేదరికంలో ఉన్న సతీశ్ కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించి మందులు వాడాడు. 15 రోజుల క్రితం నెలలు నిండిన క్రమంలో అనితను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా థైరాయిడ్ సమస్య ఉందని వైద్యులు గుర్తించారు. ప్రసవ సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడంతో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పది రోజుల క్రితం అనిత పాపకు జన్మనిచ్చింది. ఆ వెంటనే తీవ్ర అనారోగ్యానికి గురైంది. వైద్యులు చికిత్స కోసం హైద్రాబాద్ వెళ్లాలని సూచించారు.
వెంటాడిన పేదరికం..
కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న సతీశ్ పేదరికం కారణంగా బాలింతగా ఉన్న అనితను కరీంనగర్‌లోని ప్రతిమ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ చికిత్స చేయించడానికి రోజుకు కనీసం రూ.10 నుంచి రూ.15వేలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న డబ్బులు అయిపోవడంతో దాతల సాయం ఆర్థించారు.
స్పందించేలోపు..
బాలింతగా ఉన్న అనిత థైరాయిడ్ సమస్యతో ప్రాణాపాయ స్థితిలో ఉండటాన్ని గుర్తించిన స్థానిక సీపీఐ నాయకులు చెన్న విశ్వనాథం, యువజన సంఘాల నాయకులు వాసాల గణేశ్ ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. దాతల ఆర్థికసాయంతో డబ్బులు సమకూర్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనితకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అనితకు సుమారు రూ.25 వేలు అందించేందుకు ముందుకు వచ్చారు. ఇంతలోనే పరిస్థితి విషమించి బుధవారం ఉదయం ఆసుపత్రిలో మృతి చెందింది. పది రోజుల పసికందుతో సతీశ్ దయనీయస్థితిలో భార్య అనిత అంత్యక్రియలు జరిపించిన తీరు అందరినీ కదిలించింది.
కళ్లు తెరవకుండానే.. ఎల్లారెడ్డిపేట ఆరోగ్య కేంద్రంలో శిశువు మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తొమ్మిది నెలలు తల్లికడుపులో క్షేమంగా పెరిగిన బాబు లోకం చూడకుండానే కన్నుమూశాడు. పండంటి మగ బిడ్డకు జన్మనివ్వగా ఆ బాబు డాక్టర్ల నిర్లక్ష్యంతో కడుపులోనే మృతి చెందాడు. బాధితుల కథనం ప్రకారం.. వీర్నపల్లి మండలం వన్‌పల్లి గ్రామానికి చెందిన గడ్డం పూజిత పురిటినొప్పులతో ఎల్లారెడ్డిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరింది. ఉదయం 8.30 గంటలకు పూజితను ఆస్పత్రికి తీసుకురాగా వైద్యాధికారి సత్యజిత్రే పరీక్షించి కాన్పు కోసం ఆడ్మిట్ చేశారు. పూజితకు కాన్పు చేయాలని స్టాఫ్‌నర్సు గీత, ఏఎన్‌ఎం మంజుల, ఆశ వర్కర్ జమునకు సూచించారు. ఉదయం నుంచి పురిటి నొప్పులు వస్తున్నా కాన్పు చేయకుండా సాయంత్రం వరకు నీరిక్షించారు. బంధువుల ఒత్తిడితో పూజితకు చిన్న ఆపరేషన్ చేసి సాయంత్రం కాన్పు చేశారు.
అయితే అప్పటికే కడుపులోని బిడ్డ మరణించింది. ఉదయం ఆస్పత్రికి తీసుకురాగా సాయంత్రం వరకు వైద్యం చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో కడుపులో బాబు మరణించాడని పూజిత కుటుంబ సభ్యులు గడ్డం నాగవ్వ, మల్యాల రాజవ్వ ఆరోపించారు. వైద్యుడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అఖిల పక్ష నాయకులు వర్ధవెల్లి స్వామి, లక్ష్మణ్ ఆస్పత్రికి వెళ్లి సంఘటనపై డాక్టర్‌ను నిలదీశారు. పసికందు మృతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై వైద్యాధికారి సత్యజిత్రేను వివరణ కోరగా సాధారణ కాన్పు చేయాలని సాయంత్రం వరకు వేచి ఉంచామన్నారు. ఇందులో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదని తెలిపారు. ఉమ్మినీరు లేకనే బాబు మృతిచెందాడని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment