
భర్త,పిల్లలతో మధులత(ఫైల్)
జనగామ: భర్త వేధింపులను భరించలేక ఓ మహిళ.. ఇద్దరు పిల్లలతో కలసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. అన్నయ్యలకు రాఖీ కట్టేందుకు ఇంట్లో నుంచి బయలు దేరిన ఆ తల్లి, పిల్లల శరీర భాగాలు ఛిద్రమై కనిపించాయి. ఈ సంఘటన నేపథ్యంలో తమ మధ్య గొడవలు లేవని భర్త అంటుండగా.. వరకట్నం కోసం వేధించాడని పుట్టింటి వారు ఆరోపిస్తూ, అల్లుడికి దేహశుద్ధి చేశారు. జిల్లా కేంద్రంలోని రెడ్డి స్ట్రీట్‌లో నివాసముంటున్న మాదాసు మధుకర్, మధులతకు 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉదయ్ కుమార్ (08), వినయ్(4) ఉన్నారు. మధుకర్ హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
అదనపు కట్నం కోసం తరచుగా భార్యను వేధిస్తుండటంతో.. మధులత తన బాధను పుట్టింటి వారికి చెప్పుకుని కుమిలి పోయేది. ఇటీవల మధులత తండ్రి నర్సయ్య రూ.70 వేలు ఖర్చు చేసి కూతురుకు పుస్తెలతాడు చేయించారు. కాగా బోడుప్పల్‌లో నివాసముంటున్న తన సోదరుడు సతీశ్ గృహ ప్రవేశానికి వెళ్తామంటే మధుకర్ అడ్డు చెప్పడంతో..మధులత తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో రాఖీ పండుగ రోజు ఉదయం 9 గంటల వేళ ఇద్దరు కుమారులను వెంట బెట్టుకుని.. అన్న వద్దకు వెళ్తున్నానని భర్తకు చెప్పి బయలు దేరింది. అయితే తన మరో సోదరుడు సురేశ్‌కు ఫోన్ చేసి.. తాను రావడం లేదని ఒకే ఒక్క మాట చెప్పి ఫోన్ కట్ చేసి..రాజీవ్‌నగర్ ప్రాంతంలోని రైలు పట్టాల వద్దకు వెళ్లి పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment