ముంబై : తన చావుకు కారణం ముంబై డీఐజీ అని సూసైడ్ నోట్ రాసి ఇంటినుంచి బయటికి వెళ్లిన 17 ఏళ్ల అమ్మాయి కనిపించకుండా పోయిన ఘటన నవీ ముంబైలో చోటుచేసుకుంది. తన కుటుంబంపై డీఐజీ చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపింది. తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నాని, తన కోసం ఎవరు వెతకొద్దని లేఖలో పేర్కొంది. కాగా ఆత్మహత్య చేసుకునేందుకు సోమవారం ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాధితురాలు కనిపించకుండా పోయింది. అయితే ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆత్మహత్య చేసుకోవడానికి రైలు పట్టాలపైకి వెళ్లిన సమయంలో తన సోదరిని ఎవరో అపహరించారని పోలీసులకు బాధితురాలి సోదరుడు పేర్కొన్నాడు. దీంతో కుటుంబసభ్యులు ఇచ్చిన ఆధారంగా పోలీసులు కిడ్నాప్ కేసును నమోదు చేశారు.
ఇదిలా ఉంటే గతేడాది జూన్‌లో బాధితురాలు పుట్టిన రోజు వేడుకలకు ఎటువంటి ఆహ్వానం లేకున్నా డీఐజీ తన భార్యతో కలిసి వచ్చారు. కేక్ కట్ చేసిన అనంతరం అందరూ వెళ్లి అమ్మాయికి శుభాకాంక్షలు చెబుతుండగా డీఐజీ వచ్చి ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లితండ్రులకు తెలియజేయడంతో వారు డీఐజీ వేధింపులకు పాల్పడ్డాంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం తెలసుకున్న డీఐజీ పలుమార్లు వారి ఇంటికి వెళ్లి కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తేవడమే గాక బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో పోక్సో చట్టం కింద డీఐజీపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు తెలిసింది. అయితే డీఐజీపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినప్పటి నుంచి పరారీలో ఉండడం గమనార్హం. అయితే బాధితురాలిని డీఐజీ సంబంధితులు ఏమైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment