నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాజశేఖర్‌బాబు ,సరిపోలిన మునస్వామి వేలిముద్రలు
ఎన్నో హత్యలు.. కొన్ని పోలీసుల రికార్డుల్లో నమోదయ్యాయి. మరికొన్ని కాలేదు. మరెన్నో హత్యాయత్నాలు. 50కు పైగా చోరీలు.. దోపిడీలు. సైకో సీరియల్ కిల్లర్ మునస్వామిను పట్టుకోవడంలో చిత్తూరు పోలీసు యంత్రాంగం పడ్డ శ్రమ, కష్టం ఎందరో ప్రాణాలను నిలబెట్టింది. వరుస హత్యల కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చూపించడంతో ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. అయితే మునస్వామి చేసిన దారుణాల్లో 99 శాతం శుక్రవారం అర్ధరాత్రి, తెల్లవారుజామునే చేయడం గమనార్హం.
చిత్తూరు అర్బన్: ఉన్మాద హంతకుడు మునస్వామి (42)ను అరెస్టు వివరాలను మంగళవారం చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు మీడియాకు తెలియజేశారు. స్థానిక పోలీసు అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీలు ఐ.రామకృష్ణ, సుబ్బారావుతో కలిసి ఎస్పీ వివరాలను వెల్లడించారు. జిల్లాలో గత నెల 25న నగరికి చెందిన రత్నమ్మ (62), పాలసముద్రానికి చెందిన వళ్లియమ్మ (68) హత్య కేసుల్లో ఇతడు ఉన్మాది వ్యవహరించినట్లు స్పష్టం చేశారు.
శుక్రవారం హత్యలు..
జిల్లాలో జరిగిన రెండు హత్యలతో పాటు ఈనెల 16న తమిళనాడు రాష్ట్రంలో చేసిన హత్యలున్నీ దాదాపు శుక్రవారమే చేసినట్లు విచారణలో తేలింది.వేలూరులోని కొండపాలయం వద్ద దైవయాన (60)ను , గతేడాది డిసెంబరు 9న (శుక్రవారం అర్ధరాత్రి), వేలూరు జిల్లా నెమలి తాలూకాలో శకుంతల (65)ను, అదే ఏడాది ఫిబ్రవరి నెల ఓ శుక్రవారం మరో హత్య, మేలోని మరో శుక్రవారంలో రూ.50 కోసం ఏడాదిన్నర వయస్సున్న బాలికను హత్య చేసినట్లు తమిళనాడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇవి కాకుండా ఈనెల 16న (శుక్రవారం) తమిళనాడులోని వేలూరు తాలిక్కాల్ గ్రామం శాంతమ్మ (65)పై బండరాయి వేసి హత్యాయత్నం, గతేడాది డిసెంబరు 9న (శుక్రవారం) వేలూరు జిల్లా నెమలి తాలూక పల్లికన్నత్తూరుకు చెందిన లక్ష్మి (45)పై రాయి వేసి హత్యాయత్నం, డిసెంబరు 30న (శుక్రవారం అర్ధరాత్రి) తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలూక త్యాగాపురంలో ప్రమీళ (25) అనే మహిళపై బండరాయి వేసి హత్యాయత్నాలకు పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు పొందలేకపోవడం, నేరం చేసినప్పుడు పోలీసుల ప్రవర్తన, సమాజం తనను చూసిన విధానాలే మునస్వామి ఉన్మాది మారడానికి కారణమైనట్లు తేలింది.
మరిన్ని కేసులు..
1992లో తమిళనాడులోని వాలాజ ప్రాంతంలోని చేసిన చోరీ ఇతని నేర ప్రయాణానికి పునాదిగా మారింది. దాని తరువాత 1994లో రాణిపేటలో జరిగిన 3 చోరీల్లో నాలుగు నెలల జైలుశిక్ష, 1996లో రెండు చోరీల్లో 2 నెలల జైలుశిక్ష, 2000లో మూడు చోరీ కేసుల్లో 10 నెలల జైలుశిక్ష, 2001లో తొమ్మిది చోరీల్లో 10 నెలల జైలుశిక్ష, 2007లో ఓ హత్య, దోపిడీ, ఆరు చోరీల్లో 66 నెలల జైలుశిక్ష అనుభవిం చాడు. ఇప్పటి వరకు ఒక్కటి మినహా మిగిలిన హత్యలన్నీ మునస్వామి శుక్రవారమే చేసినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధ మహిళల్ని చంపి.. మృతదేహాల ఛాతి భాగాన్ని పళ్లతో కొరకి మృనస్వామి వికృతానం దం పొందేవాడని విచారణలో స్పష్టమైంది. అత్యాచారం చేస్తే తనకు ఎయిడ్స్ సోకుతుందనే భయంతో అత్యాచారానికి పాల్పడలేదని విచారణలో తెలిపడం Výæమనార్హం. ఇక బంగారు ఆభరణాలు దొంగిలిస్తే వీటిని అమ్మేటప్పుడు పోలీసులకు దొరికిపోతామని ఎక్కడా బంగారం ముట్టేవాడుకాదు. కానీ హత్యా స్థలాల్లో అతడి వేలిముద్రలు నమోదయ్యాయి.
పట్టించిన టెక్నాలజీ..
వేలిముద్రల ఆధారంగా దాదాపు 52 వేల పాత నేరస్తుల వేలిముద్రలను పరిశీలించిన పోలీసుశాఖకు వేలూరు జిల్లా పోలీసుల వద్ద ఉన్న ముద్రలతో సరిపోలాయి. వీటి ఆధారంగా చిత్తూరు పోలీసులు ఉపయోగిస్తున్న ఫేస్‌టాగర్ ఆధారంగా మునస్వామి ఫొటో ప్రత్యక్షమవడంతో అతన్ని కాపుకాసి పట్టుకోవడంతో మరిన్ని సీరియల్ హత్యలు జరగకుండా పోలీసులు నిరోధించారు. ఈ కేసు ఛేదనలో దాదాపు 60 మంది వరకు పోలీసు అధికారులు, సిబ్బంది కష్టపడ్డారు. ప్రధానంగా చిత్తూరు సీసీఎస్ డీఎస్పీ ఐ.రామకృష్ణ, అర్బన్ డీఎస్పీ సుబ్బారావుతో పాటు పశ్చిమ సీఐ ఎం.ఆదినారాయణ, వేలిముద్రల సేకరణ నిపుణులు దినేష్‌కుమార్, దస్తగిరీషా, స్పెషల్ పార్టీ, క్రైమ్ పార్టీ, తాలూక, పశ్చిమ విభాగం పోలీసుల్ని ఎస్పీ రాజశేఖర్‌బాబు అభినందించి నగదు రివార్డులను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment