మినగల్లులో వ్యక్తి హత్య | Murder Case in Minagallu PSR Nellore | Sakshi
Sakshi News home page

మినగల్లులో వ్యక్తి హత్య

Published Sat, Sep 14 2019 1:26 PM | Last Updated on Sat, Sep 14 2019 1:26 PM

Murder Case in Minagallu PSR Nellore - Sakshi

సంఘటనా స్థలానికి వెళుతున్న ఆత్మకూరు డీఎస్పీ, పోలీసులు

సోమశిల: ఇళ్ల మధ్య వేసిన గడ్డివామి విషయంలో ఏర్పడిన వివాదం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. మృతుడి భార్య, కుమారుడికి గాయాపడ్డారు. ఈ ఘటన అనంతసాగరం మండలంలోని మినగల్లు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆత్మకూరు డీఎస్పీ మక్బుల్‌ కథనం మేరకు.. గ్రామానికి చెందిన చిట్టిబోయిన వెంగయ్య (55), ధనమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారి ఇంటి వెనుక వైపునున్న సడ్డా హజరత్‌రెడ్డి అనే వ్యక్తి వెంగయ్య ఇంటి సమీపంలో తన స్థలంలో గడ్డివామి వేసుకున్నాడు. ఈక్రమంలో గడ్డి తన ఇంటి మీద పడుతోందని వెంగయ్య పలుమార్లు హజరత్‌రెడ్డితో వివాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. పోలీసు కేసులు పెట్టుకున్నారు.

మేత వేసేందుకు వెళ్లగా..
శుక్రవారం ఉదయం వెంగయ్య తన ఇంటి ఎదురుగా సందులో ఉన్న పశువులకు మేత వేసేందుకు వెళ్లగా అక్కడే కాపు కాచి ఉన్న హజరత్‌రెడ్డి, అతని భార్య కొండమ్మ, కొడుకు అశోక్‌రెడ్డి, వారి ఇంటి పక్కనుండే వ్యక్తి సడ్డా అనిల్‌రెడ్డి (2019 సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్‌)లు వెంగయ్యపై కత్తి, కర్రలతో దాడి చేశారు. ఈక్రమంలో అడ్డుకునేందుకు వెళ్లిన వెంగయ్య భార్య ధనమ్మ, కుమారుడు మహేంద్రపై కూడా దాడి చేశారు. వెంగయ్య తలపై తీవ్ర గాయమైంది. మిగిలిన వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుర్తించి క్షతగాత్రులను ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. వెంగయ్య మార్గమధ్యలో మృతిచెందాడు. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు.

డీఎస్పీ పరిశీలన
సమాచారం అందుకున్న ఆత్మకూరు డీఎస్పీ మక్బుల్, ఎస్సైలు రాకేష్, కాంతికుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలను ఆరా తీశారు. దాడికి వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహానికి ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కాగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆత్మకూరు సీఐ పాపారావు ఆధ్వర్యంలో పికెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు పికెట్‌ కొనసాగుతుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement