హత్యకు గురైన గుంజి రమణమ్మ రమణమ్మ (ఫైల్) ,కె శేషమ్మ (ఫైల్)
జిల్లాలో ఒకేరోజు రెండు చోట్ల దారుణాలు జరిగాయి. మృగాళ్ల దాష్టీకానికి ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. వెంకటాచలం మండలం కసుమూరులో నగలు, నగదు కోసం ఇంట్లో నిద్రపోతున్న మహిళను హత్య చేయగా, ఆత్మకూరులో అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు జిల్లాలో సంచలనం సృష్టించాయి.
వెంకటాచలం: ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మండలంలోని కసుమూరులో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. కసుమూరు రామాలయం సమీపంలో నివాసం ఉంటున్న ఆలకుంట కృష్ణయ్య వద్ద అతని సోదరి గుంజి రమణమ్మ (55) కొన్నేళ్ల నుంచి ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణయ్యకు ఆమె సోదరి రమణమ్మ అండగా ఉండేది. ఆదివారం రాత్రి కృష్ణయ్య వరండాలో, రమణమ్మ ఆరుబయట మంచాలపై నిద్రించారు. 11 గంటల సమయంలో వర్షం రావడంతో రమణమ్మ తన మంచాన్ని వంట గదిలో వేసుకుని నిద్రించింది. 12 గంటలు దాటిన తర్వాత రమణమ్మ గాఢ నిద్రలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు రమణమ్మ నోట్లో గుడ్డలు కుక్కి కత్తులతో పొడిచారు. ఆమె ఒంటిపై ఉన్న 4.4 సవర్ల బంగారు నగలు, బీరువాలో ఉన్న రూ.10 వేల నగదుతో ఉడాయించారు. తీవ్రంగా గాయపడిన రమణమ్మ కొన ఊపిరితో ఉన్న సమయంలో కృష్ణయ్యకు ఏడుపులు వినిపించాయి. కృష్ణయ్య మేల్కోని చూసి వెంటనే పెద్దగా కేకలు వేయడంతో చుట్టు పక్కల నివాసాల వారు అక్కడకు చేరుకున్నారు. రక్తపుమడుగులో పడి ఉన్న రమణమ్మను చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. జిల్లాప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వై ద్యులు నిర్ధారించారు.
జిల్లా ఎస్పీ రామకృష్ణ పరిశీలన
కసుమూరులో అర్ధరాత్రి మహిళ దారుణహత్యకు గురైందని తెలియడంతో జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ సోమవారం మధ్యాహ్నం కసుమూరుకు వచ్చారు. హత్య చేసి బంగారు నగలు దోచుకుపోవడంతో పార్ధీ గ్యాంగ్ పని అయి ఉంటుందనే అనుమానాలు రావడంతో ఎస్పీ పరిశీలించారు. ఈ కేసుపై ముమ్మర దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకోవాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు. అంతకుముందు డీఎస్పీ రాఘవరెడ్డి, సీఐ వి.శ్రీనివాసరెడ్డి, ఎస్సై తన్నీరు నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల నివాసాల వారిని విచారించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీం సిబ్బందితో వేలిముద్రలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ మృతురాలి నివాసం నుంచి తిరిగి నేరుగా రోడ్డుపై వెళ్లి కొద్ది దూరం నుంచి వెనక్కి వచ్చేసింది. దీంతో గ్రామంలో చివర పాతకాలనీలో నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రానికి చెందిన వారిపై కసుమూరు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అక్కడకు వెళ్లివారిని విచారించారు. రమణమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పుట్టింటికి వచ్చి..
ఆత్మకూరు: పోలేమరమ్మకు పొంగళ్లు పెట్టుకునేందుకు పుట్టింటికి వచ్చిన ఓ గిరిజన మహిళ దారుణ హత్యకు గురైంది. ఘటనా స్థలాన్ని బట్టి చేస్తూ ఆమెపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సోమవారం పట్టణ పరిధిలోని అనంతరాయనియేని పొలాల్లో వెలుగు చూసింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. పట్టణంలోని 9వ వార్డు ప్రాంతం అనంతరాయనియేని ప్రాంతానికి చెందిన కె శేషమ్మ (45)కు దగదర్తి మండలం కాట్రాయపాడుకు చెందిన వ్యక్తితో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. అనంతరాయనియేనిలో పోలేరమ్మ అమ్మవారికి పొంగళ్లు పెట్టుకునే ఉత్సవం జరుగుతుండడంతో శనివారం పుట్టింటికి చేరుకుంది. ఆదివారం గ్రామ దేవతకు పొంగళ్లను నైవేద్యాలుగా పెట్టుకున్న అనంతరం సాయంత్రం ఆత్మకూరుకు వెళ్లి వస్తానని ఇంటి వద్ద చెప్పి వెళ్లింది. ఆమె రాత్రికి ఇంటికి రాలేదు.
అయితే సోమవారం ఉదయం స్థానిక రైతులు పొలాలకు వెళ్లే మార్గంలో మహిళ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ జీ రామాంజనేయులరెడ్డి, సీఐ ఎండీ అల్తాఫ్‌హుస్సేన్, ఏఎస్సై విక్రమ్ తమ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పొలాలకు కంచె వేసే రాయితో ఆమె తలపై మోదినట్లు, చిన్న చాకులతో ఆమెను పొడిచినట్లు గుర్తులు కనిపించాయి. మూడు చిన్న చాకులు, మృతురాలికి సంబంధించిన సెల్‌ఫోన్ ఆ సమీపంలోనే పడి ఉన్నాయి. నెల్లూరు నుంచి రప్పించిన పోలీస్ జాగిలం హత్య జరిగిన స్థలంలో తిరిగి సమీపంలోనే ఆత్మకూరుకు వెళ్లే మార్గం వరకు వచ్చి నిలిచిపోయింది. దీంతో ఎలాంటి ధృడమైన ఆధారాలు లభించలేదు. అయితే ఘటనా స్థలాన్ని బట్టి మృతురాలిపై ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తులు దాడికి పాల్పడినట్లు, వారు ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో లభించిన సెల్‌ఫోన్‌లోని కాల్ డేటా ఆధారంగా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment