
బుక్కరాయసముద్రం(అనంతపురం జిల్లా): ఓ వ్యక్తి హత్యకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. స్థానిక ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. బుక్కరాయసముద్రం మండలంలోని ఓ గ్రామంలో ఓ వివాహితకు ఏడాది క్రితం కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన కోటేశ్వరరావు నుంచి రాంగ్ కాల్ వచ్చింది. అప్పటి నుంచి వారి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కర్నూలు నుంచి కోటేశ్వరరావు అనంతపురానికి వచ్చి ఆ వివాహితను తరచూ కలుసుకునేవాడు. తన వివాహేతర సంబంధంపై భర్తకు అనుమానం రాకుండా ఆమె జాగ్రత్త పడింది. భర్త అడ్డు తొలగించుకుని ప్రియునితో శాశ్వతంగా ఉండిపోవాలని ఆమె నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో ప్రియునితో కలిసి భర్త హత్యకు పథకం రచించింది. దీంతో కోటేశ్వర రావు రూ.2.50 లక్షలతో అనంతపురానికి చెందిన ఆరుగురు కిరాయి హంతకముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వివాహిత భర్తను హత్య చేసేందుకు రెండు రోజుల క్రితం కారులో వస్తున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ సమాచారంతో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తన బృందంతో నార్పల క్రాసింగ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ మార్గంలో వచ్చిన కోటేశ్వరరావుతో సహా ఆరుగురు కిరాయి రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయం వివాహిత భర్తకు ఇంకా తెలియలేదని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment