![Murder In Kurnool Yemmiganur - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/14/mur.jpg.webp?itok=u54TOdhs)
మృతుడు తెలుగు హరికుమార్
ఎమ్మిగనూరు : పట్టణంలో బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గీతానగర్‌లో నివాసం ఉంటున్న తెలుగు శ్రీనివాసులు కుమారుడు హరికుమార్ (24)ను గుర్తు తెలియని వ్యక్తులు వేటాడి హతమార్చారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. స్థానిక గాంధీ నగర్‌లోని గోబీ సెంటర్ వద్ద ఉన్న హరిని గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో వెంబడించారు. ప్రాణ భయంతో ఆదోని బైపాస్ రోడ్డులోని సుబ్బాజి డాబాలో తలదాచుకునేందుకు వెళ్లగా.. కొడవళ్లతో నరికారు. విషయం తెలుసుకున్న సీఐ ప్రసాద్, ఎమ్మిగనూరు, నందవరం ఎస్‌ఐలు హరిప్రసాద్, జగన్ మోహన్ యాదవ్‌లు హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న క్షతగాత్రుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అక్కడ డాక్టర్ బాలాజీకుమార్ ప్రథమ చికిత్స నిర్వహించేందుకు ప్రయత్నిస్తుండగానే హరికుమార్ ఊపిరి వదిలాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న శ్రీనివాసులు దంపతులు ఆస్పత్రి ప్రాంగణంలో ఆర్తనాదాలు చేశారు. ప్రేమ వ్యవహారమా.. లేదా ఇతర కారణాలతో హరి హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment