
ముస్లిం యువకుడిపై దాడి చేస్తున్న దృశ్యం
హిందూ యువతిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్న ముస్లిం యువకుడిని దారుణంగా కొట్టి..
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకునేందుకు రిజిస్ట్రార్ ఆఫీస్‌కు చేరుకున్న ఓ ముస్లిం యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కనికరం లేకుండా దాడి చేశారు. ఆ తర్వాత అతడిని ఈడ్చుకెళ్లి రోడ్డుపై ఊరేగించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన యువకుడు(ముస్లిం), ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతి(హిందూ) వృత్తి రీత్యా నోయిడాలో స్థిరపడ్డారు. ఒకే కంపెనీలో పని చేస్తున్న ఇరువురి మధ్య ప్రేమ చిగురించడంతో వివాహ బంధంతో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు ఘజియాబాద్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. పెళ్లికి సంబంధించిన వివరాలను తెలసుకునేందుకు న్యాయవాదితో చర్చిస్తుండగా లాయర్ చాంబర్‌లోకి దూసుకెళ్లిన కొందరు వ్యక్తులు యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ప్రేమ జంటతో పాటు దాడికి పాల్పడిన వారిలో ఇద్దరిని స్టేషన్‌కు తీసుకొచ్చారు.
ప్రేమికులు తాము మేజర్లమని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పడంతో పాటు ఆధారాలు చూపించడంతో వారిని వదిలిపెట్టారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఘజియాబాద్ ఎస్పీ తెలిపారు. అయితే, దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసేందుకు ప్రేమ జంట నిరాకరించింది.