నాగర్ కర్నూల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సివిల్ కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు రాజేశ్‌ను శుక్రవారం పోలీసులు మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పోలీసులు.. ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు. డీఎస్పీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... పథకం ప్రకారమే సుధాకర్ రెడ్డిని హత్య చేసినట్లు తెలిపారు. ఈ కేసులో రాజేశ్ ఏ1, స్వాతిని ఏ2గా చేర్చినట్లు తెలిపారు. ‘నలుగురు వ్యక్తులు వచ్చి సుధాకర్ రెడ్డిపై యాసిడ్ దాడి చేశారని కుటుంబ సభ్యులకు స్వాతి చెప్పింది. ఆ వెంటనే మహబూబ్‌నగర్‌కు అక్కడ నుంచి హైదరాబాద్ డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లింది.
ముందే వేసుకున్న పథకం ప్రకారం ఇద్దరు కలిసి సుధాకర్‌రెడ్డి ఇంట్లో హత్య చేసి అటవీ ప్రాంతంలో కాల్చేశారు. తన తండ్రి చనిపోవడంతో కొద్దిరోజులుగా నిద్ర పట్టడం లేదని రాజేశ్ తన స్నేహితుడు నరేష్‌ను కోరాడు. ఆ తర్వాత సుధాకర్ రెడ్డి పడుకున్న సమయంలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చితలపై మోది ఇద్దరు కలిసి హతమార్చారు. ఆ తర్వాత ఇంటికొచ్చాక రాజేశ్ ముఖాన్ని కాల్చుకున్నాడు. కానీ ...అనుకున్న మేరకు కాలకపోవడంతో ముఖాన్ని స్టౌపై పెట్టాడు. హైదరాబాద్ ఆస్పత్రిలో రాజేశ్‌ను చేర్చించిన వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేయాలని డాక్టర్లను స్వాతి కోరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది సుధాకర్ రెడ్డి కాదని కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో ఆ విషయాన్ని వారు మా దృష్టికి తెచ్చారు.
మేం స్వాతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే హత్య విషయం తేలింది. స్వాతికి, రాజేశ్‌కు రెండేళ్లుగా సంబంధం ఉంది. కానీ ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియదు. అయితే ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లిపోదామని స్వాతిని రాజేశ్ అడిగాడు. కానీ పిల్లలు, తల్లిదండ్రులను వదిలి రానని స్వాతి చెప్పింది. ఇద్దరం కలిసి ఉండాలంటే సుధాకర్ రెడ్డిని హత్య చేసి ఆ స్థానంలో నువ్వు రావాలని స్వాతి ఈ సందర్భంగా రాజేశ్‌కు చెప్పింది. దాంతో ఇద్దరు ఆలోచించి ప్లాన్ చేశారు’ అని తెలిపారు. అలాగే సుధాకర్ రెడ్డి శవాన్ని కాల్చిన సంఘటనా స్థలం నుంచి సిరెంజ్, ఐరన్ రాడ్, చున్నీని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో విచారణ జరపాల్సిన అంశాలు చాలానే ఉన్నాయన్నారు. ప్రధాన నిందితుడు రాజేశ్ మాట్లాడుతూ...‘మేమిద్దం కలిసే సుధాకర్ రెడ్డిని హత్య చేశాం. సుధాకర్ రెడ్డి తనను కొడుతున్నాడని, పట్టించుకోవడం లేదని స్వాతి తరచు నాకు చెప్పేది. హత్యకు పథకం పన్నాక ఒకసారి ఆలోచించమని స్వాతిని కోరా. హ్యాపీగా ఉండాలంటే ప్లాన్‌ను అమలు చేయాల్సిందేనని స్వాతి చెప్పింది.’ అని తెలిపాడు.
కాగా ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చిన నిందితురాలు స్వాతిని శుక్రవారం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 29వ వరకూ రిమాండ్ పొడిగించింది. నాగర్ కర్నూల్‌లో సివిల్ కాంట్రాక్టర్‌సుధాకర్ రెడ్డిని భార్య స్వాతి హత్య చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment