సాక్షి, హైదరాబాద్ : నాగర్ కర్నూల్ సివిల్ కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజేశ్ గురువారం పోలీసుల విచారణలో పలు విషయాలను వెల్లడించాడు. సుధాకర్ రెడ్డి భార్య స్వాతి తనకు అన్నవిధాలా ఆర్థిక సాయం చేసిందని అతడు తెలిపాడు. స్వాతి ఇచ్చిన డబ్బులతోనే డ్రెస్‌లను కొనుక్కునేవాడినని చెప్పాడు. అంతేకాకుండా స్వాతి టీవీ సీరియల్స్ బాగా చూస్తుందని, చాలాసార్లు తనకు ఆ స్టోరీలు చెప్పేదని వివరించాడు. ఇక సుధాకర్ రెడ్డి హత్య విషయంలో స్వాతి చెప్పినట్లే చేశానని రాజేశ్ పోలీసుల విచారణలో తెలిపారు. కాగా హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేశ్‌ను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
స్వాతి .. ఖైదీ నెంబర్ 678
పథకం ప్రకారమే కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చిన నిందితురాలు స్వాతి ప్రస్తుతం పాలమూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంది. అయితే ఆమె ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోగా, తోటి ఖైదీలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వాతికి జైలు అధికారులు 678 ఖైదీ నెంబర్‌ను కేటాయించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం పూర్తి చేసిన ఆమె... తోటి ఖైదీలతో పాటు జైలులో గడ్డి కోసింది.
కాగా స్వాతి వ్యవహారం మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉన్నదని పోలీసుల విచారణలో బయటపడింది. నర్సింగ్ శిక్షణ పొందిన స్వాతి ఆ సమయంలో పలువురితో చనువుగా మెలిగేదని తెలుస్తోంది. జల్సాలకు ఎక్కువగా అలవాటు పడ్డ స్వాతిని తన పద్ధతి మార్చుకోవాలని భర్త తరచు చెబుతూ వచ్చేవాడని సమాచారం. అయితే మూడు నెలల నుంచే సుధాకర్ రెడ్డిని అడ్డు తొలగించుకునేందుకు స్వాతి, ఆమె ప్రియుడు రాజేశ్ పథకం రచిస్తూ వచ్చారని, గతనెల 27న అందుకు మంచి అవకాశం దొరకడంతో పని ముగించినట్లు పోలీసులు తెలిపారు. కట్టుకున్న భర్త, కన్నబిడ్డలను కాదనుకుని ప్రియుడితో గడపాలన్న తపనతో స్వాతి ...సుధాకర్‌రెడ్డిని అత్యంత కిరాతకంగా హతమార్చడంపై నాగర్ కర్నూల్‌లో ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment