సాక్షి, బెంగళూరు : ఏడో తరగతి విద్యార్థి తలకు గాయం అయ్యేలా కొట్టిన బెంగళూరులోని నారాయణ ఇ–టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వివరాలు.. పాఠశాల వార్షికోత్సవంలో ప్రదర్శించడానికి 13 ఏళ్ల విద్యార్థి స్కూల్లో శిక్షణ పొందుతున్నాడు. ఈ నెల 16న సౌండ్ ఎక్కువగా పెట్టి నృత్య సాధన చేస్తుండగా అక్కడికి చేరుకున్న ఉపాధ్యాయురాలు రేష్మా... విద్యార్థిని మందలించాలని కట్టెతో కొట్టబోయింది. విద్యార్థి తప్పించుకోవడంతో ఆమె కోపం పట్టలేక డస్టర్ విసరగా, అది విద్యార్థి తలకు తగిలి రక్తం కారింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ ప్రిన్సిపల్ శాజి సెబాస్టిన్, ఉపాధ్యాయుడు మ్యాథ్యోలు విద్యార్థిని బెదిరించారు. తర్వాత విద్యార్థి తల్లికి ఫోన్ చేసి, మీ కొడుకు కాలుజారి పడ్డాడని చెప్పగా ఆమె వచ్చి బాలున్ని తీసుకెళ్లి వైద్యం చేయించింది. బాలుడు ఆరోజు రాత్రి జరిగిన విషయాన్ని తల్లికి వివరించాడు. ఈ ఉదంతంపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో చట్టం కింద ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై కేసును నమోదు చేశారు. ముగ్గురినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నిందితుల్లో రేష్మా ఏపీకి చెందినవారు కాగా, మిగతా ఇద్దరూ కేరళ వారు.
Comments
Please login to add a commentAdd a comment