
సాక్షి, హైదరాబాద్ : కులాంతర వివాహం చేసుకున్నారని నవదంపతులపై పట్టపగలే అమ్మాయి తండ్రి హత్యాయత్నం చేయడం నగరంలో కలకలం సృష్టించింది. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన సందీప్ ఈ నెల 12న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి పెళ్లిని జీర్ణించుకొని మాధవి తండ్రి మనోహర చారి కక్షతో వారిపై పట్టపగలే కత్తితో దాడి చేశాడు.
ఈ ఘటనపై సందీప్ సోదరుడు సతీష్ సాక్షితో మాట్లాడుతూ.. ‘అమ్మాయి తండ్రి ఫోన్ చేసి హోండా షో రూం దగ్గరకు రమ్మన్నాడు. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్నకత్తితో ఇద్దరిపై దాడిచేశాడు. కులాంతర వివాహం చేసుకున్నారని పగతోనే ఈ దాడి చేశాడు. మా అన్న పెళ్లి చేసుకొని ఐదు రోజులే అవుతోంది. పెళ్లి అయిన తరువాత వాళ్ల కుటుంబం వచ్చి మా పాపను మంచిగా చూసుకోండి అని చెప్పారు. మళ్లీ ఈరోజు అతను బాగా తాగి వచ్చి దాడి చేశాడు. రిసెఫ్షన్ చేస్తామని నమ్మించాడు. సందీప్ పరిస్థితి పరవాలేదు కానీ.. అమ్మాయి పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఐదేళ్ల నుంచి వాళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు. 10వ తరగతి నుంచే లవ్ చేసుకుంటున్నారు. మాది మాల కుటుంబం. అమ్మాయిది విశ్వబ్రాహ్మణ కులం. ఇద్దరు మేజర్లే. డ్రిగ్రీ పూర్తి చేశార’ని తెలిపాడు. ఇక మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఘటన మరవక ముందే నగరం నడిబొడ్డున ఈ ఘటన చోటుచేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment