
సాక్షి, అనంతపురం : కాళ్ల పారాణి ఆరకముందే.. పెళ్లి పందిరి తీయకముందే నవ వరుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.... ఉరవకొండ మండలం షేక్షానుపల్లికి చెందిన కురుబ వెంకటస్వామి నాలుగో సంతానమైన రామచంద్ర (23)కు విడపనకల్లు మండలం హావళిగి గ్రామానికి చెందిన రత్నమ్మతో గత ఆదివారం పెద్దల సమక్షంలో వివాహమైంది.
పెళ్లయిన రోజు నుంచి వధువు ఇంట్లో ఉన్న నవదంపతులు శనివారం సాయంత్రం వడిబియ్యం పెట్టుకుని షేక్షానుపల్లికి వచ్చారు. కొద్దిసేపటి తర్వాత తోటకు వెళ్లి వస్తానని రామచంద్ర ఇంట్లో చెప్పి బయటకు వచ్చాడు. గంట తర్వాత ఇంటికి ఫోన్ చేసి తాను పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. కుటుంబ సభ్యులు పరుగుపరుగున తోటకెళ్లి చూడగా రామచంద్ర అపస్మారకస్థితిలో కనిపించాడు. వెంటనే ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి కారులో తీసుకెళ్లారు.
పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో అక్కడి నుంచి నేరుగా అనంతపురంలోని కిమ్స్ సవీర ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున రామచంద్ర మృతి చెందాడు. ఇష్టం లేని పెళ్లి చేసినందు వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment