
ముప్పిడి లక్ష్మి మృతదేహం
తాడేపల్లిగూడెం రూరల్ : ప్రేమించిన వ్యక్తి నమ్మించి మోసగించడంతో మనస్తాపానికి గురైన యువతి ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి తాడేపల్లిగూడెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. చాగల్లు మండలం కలవలపల్లి గ్రా మానికి చెందిన ముప్పిడి లక్ష్మి అలియాస్ తబిత (26) పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రెండేళ్లుగా నర్సుగా పనిచేస్తుంది. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న దాకే మేరీ సుశీల బంధువైన సుధాకర్‌ను ప్రే మించింది. సుధాకర్ ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ప్రస్తుతం సుధాకర్ ఉపాధి నిమిత్తం మస్కట్‌లో ఉంటున్నాడు. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో లక్ష్మికి సుధాకర్ ఫోన్ చేశాడు. వారిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో లక్ష్మి ఉరిపోసుకుంటానని చెప్పిందని, ఈవిషయాన్ని సుధాకర్ ఫోన్‌లో ఆస్పత్రి రిసెప్షన్‌లో ఉన్న మేరీ సుశీలకు చెప్పాడు.
దీంతో హుటాహుటిన సుశీల ఆస్పత్రి స్టాఫ్ రూమ్‌లో ఉన్న లక్ష్మి వద్దకు వెళ్లి చూడగా గది గడియలు పెట్టి ఉన్నాయి. తలుపులు పగులకొట్టి చూడగా అప్పటికే లక్ష్మి ఫ్యాన్‌కు చున్నీతో ఉరిపోసుకుని మృతిచెంది ఉన్నట్టు గుర్తించి డాక్టర్ వినయ్‌కు సమాచారం ఇచ్చారు. ప్రియుడు నమ్మించి మోసగించడంతోనే లక్ష్మి ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. పట్టణ పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై సీహెచ్ ఆంజనేయులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. రిసెప్షనిస్ట్ దాకే మేరీ సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రియుడు సుధాకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీ మృతి వార్త తెలియడంతో బంధువులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. లక్ష్మి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
కుటుంబానికి ఆమే ఆధారం
చాగల్లు మండలం కలవలపల్లి గ్రామానికి చెందిన ముప్పిడి చిరంజీవి, నీలవేణికి ముగ్గురు సంతానం. లక్ష్మి పెద్దది కాగా మిగిలిన ఇద్దరు కుమారులు. లక్ష్మి తండ్రి చిరంజీవి ఏడాదిన్నర క్రితం మృతి చెందాడు. ఏఎన్‌ఎం కోర్సు పూర్తిచేసిన లక్ష్మి తాడేపల్లిగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. తండ్రి చనిపోవడంతో లక్ష్మి కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. ఆమె సంపాదనే కుటుంబానికి ప్రధాన జీవనాధారం. లక్ష్మి మృతి చెందడంతో కుటుంబానికి ఆధారం కోల్పోయింది. వివాహం చేసుకుని ఒక ఇంటికి వెళ్తుందని ఆశించామని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందంటూ తల్లి నీలవేణి, సోదరులు, బంధువుల రోదించారు. అటు స్వగ్రామం కలవలపల్లిలో, ఇటు ఆస్పత్రిలో విషాదఛాయలు అలముకున్నాయి.