సాక్షి, ఖమ్మం : సాఫ్ట్‌వేర్ కంపెనీలో వాటా ఇస్తానని చెప్పి తాంత్రిక బాబా ఓ మహిళను నమ్మించాడు. ఆమె వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడు. నెలలు గడిచినా డబ్బులు రాకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని వన్ టౌన్ పరిధిలోని స్టేషన్ రోడ్‌కు సమీపంలో నివాసం ఉంటున్న ఓ మహిళ తన భర్త మృతి చెందటంతో తనకు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగంతో పిల్లలను పోషించుకుంటోంది.
ఇంట్లో తరచూ సమస్యలు ఉంటుండడంతో.. ఆమె బంధువు ఒకరు విజయవాడలోని భవానీపురానికి చెందిన త్రిశక్తి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు తాంత్రికబాబా అయిన కోనాల అచ్చిరెడ్డి గురించి చెప్పారు. దీంతో ఆమె విజయవాడ వెళ్లి బాబాను కలిసింది. కొద్ది నెలల్లో వారి మధ్య పరిచయం పెరిగింది. ఈ క్రమంలో బాబా తన మాయమాటలతో ఆమెను నమ్మించాడు. తాము విశాఖ పట్టణంలో సాఫ్ట్‌వేర్ కంపెనీ పెడుతున్నామని, రూ.50 లక్షలు ఇస్తే నిన్ను డైరెక్టర్‌గా చేస్తామని బాబాతో పాటు ఆయన కుమారుడు వంశీకృష్ణారెడ్డి ప్రలోభపెట్టారు. అనంతరం 50 లక్షల రూపాయలతో పాటు ఆమె దగ్గర నుంచి కారును కూడా తీసుకున్నారు. ఈ తర్వాత ముఖం చాటేశారు.
నిలదీసిన మహిళకు లైంగిక వేధింపులు
తన డబ్బులు తీసుకుని మోసగించారని బాబాతో పాటు ఆయన కుమారుడు, అనుచరులను సదరు మహిళ నిలదీయటంతో తమ వద్ద నగ్న చిత్రాలు ఉన్నాయని, డబ్బులు అడిగితే అవి సోషల్ మీడియాలో పెట్టి నీ పరువు తీస్తామని బెదిరించారు. పైగా ఖాళీ ప్రామీసరి నోట్లపై సంతకాలు సైతం చేయించుకున్నారు. దీంతో ఆందోళనకు గురైన ఆమె వారం రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించింది. దీంతో కుటుంబ సభ్యులు ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బాబా అతని కుమారుడు, అనుచరులపై 420, 354(ఎ),406, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పరారీలో అచ్చిరెడ్డి, అతని కుమారుడు..
మహిళ ఫిర్యాదు మేరకు ఖమ్మం వన్‌టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ విజయవాడకు వెళ్లగా అప్పటికే తాంత్రికబాబా, అతని కుమారుడు వంశీకృష్ణారెడ్డి పారిపోయారు. త్వరలో వారిని పట్టుకుంటామని సీఐ రమేష్ తెలిపారు. కాగా బాబా అనుచరుడు ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment