సాక్షి, శెట్టూరు (కళ్యాణదుర్గం): యువకుడి హత్య గుట్టు రట్టయ్యింది. మిస్సింగ్ కేసు నమోదుతో విచారణ చేపట్టిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు. ఏడాది కిందట లేపాక్షి సమీపంలో జరిగిన హత్య కేసు వివరాలను కళ్యాణదుర్గం డీఎస్పీ టీఎస్ వెంకటరమణ, సీఐ శివప్రసాద్, పట్టణ ఎస్‌ఐ శంకర్‌రెడ్డిలు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. నిందితులైన భార్య, ఆమె ప్రియుడుతోపాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
భర్త అడ్డు తొలగించుకున్నదిలా..
తమ వివాహేతర సంబంధం సాఫీగా సాగిపోవాలంటే నందిని భర్త మంజునాథ్‌ను అడ్డు తొలగించుకోవాలని బొల్లు విశ్వేశ్వరరెడ్డి కుట్రపన్నాడు. ఇందు కోసం యలగలవంక గ్రామానికి చెందిన స్నేహితుడు మాదిగ హనుమంతరాయుడుతో కలిసి 2017 జనవరి మూడో తేదీన మంజునాథ్‌కు హిందూపురంలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తమ బైకులో ఎక్కించుకెళ్లారు. మంజునాథ్‌కు మార్గం మధ్యలో మద్యం తాపించారు. లేపాక్షి దాటిన తర్వాత కనుమగుడి దగ్గర ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లారు. అక్కడ మరోమారు మద్యం పూటుగా తాపారు. మత్తులో ఉన్న మంజునాథ్ కాళ్లను హనుమంతరాయుడు కాళ్లు గట్టిగా పట్టుకోగా.. విశ్వేశ్వరరెడ్డి అతని గొంతు కోసి చంపేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని కిరోసిన్ పోసి నిప్పంటించారు. కాలిన అనంతరం శవాన్ని అక్కడే ఓ గుంతలో పూడ్చి వచ్చేశారు.
వెలుగు చూసిన హత్య కేసు
బోయ దాసరి మంజునాథ్ కనిపించడం లేదంటూ తమ్ముడు దాసరి అనిల్ ఈ నెల ఆరో తేదిన కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న ఎస్‌ఐ శంకర్‌రెడ్డి.. మంజునాథ్ భార్య నందినిని పలు కోణాల్లో విచారించారు. భర్త కొన్ని నెలలుగా కనిపించపోయినా తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఆమె స్వగ్రామం సింగేపల్లికి వెళ్లడంపై పోలీసులకు అనుమానం కలిగింది. లోతుగా దర్యాప్తు చేయడంతో యలగలవంక గ్రామానికి చెందిన విశ్వేశ్వరరెడ్డితో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు.
వీఆర్వో ఎదుట లొంగిపోయిన నిందితులు
పోలీసుల విచారణతో హత్య విషయం తెలుస్తుందని భయపడిన నిందితులు ఇటీవల ఇళ్ల నుంచి పారిపోయారు. ఎట్టకేలకు గురువారం ఉదయం నందిని, విశ్వేశ్వరరెడ్డి, హనుమంతరెడ్డిలు మానిరేవు వీఆర్వో ఇంటి వద్ద లొంగిపోయారు. నిందితులు వాడిన కత్తి, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సంఘటన స్థలంలో లభ్యమైన హతుడి పుర్రెను డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
హత్య నేపథ్యం..
కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన బోయ దాసరి మంజునాథ్(32)కు బొమ్మనహళ్ మండలం సింగేపల్లికి చెందిన దాసరి నందినితో వివాహమైంది. వీరిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కూలి పనులకెళ్లే సమయంలో బెళుగుప్ప మండలం యలగలవంక గ్రామానికి చెందిన బొల్లు విశ్వేశ్వరరెడ్డితో నందినికి ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment